ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియాను ఊరిస్తున్న అగ్రస్థానం

0
72

ప్పుడు ప్రపంచ క్రికెట్లో టీమ్‌ఇండియా ఉన్న ఊపులో మరే జట్టూ లేదు. ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌ల్లో ఓడించి.. ఆపై న్యూజిలాండ్‌పై వారి దేశంలో వన్డే సిరీస్‌ గెలిచి శభాష్‌ అనిపించుకుంది భారత జట్టు. ఇంకో నాలుగు నెలల్లోపే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ ఆరంభం కాబోతుండగా.. ఇప్పుడు కోహ్లీసేన ఇలాంటి ఊపులో కొనసాగుతుండటం అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. ఈ మెగా టోర్నీకి ముందు జట్టులో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి. జట్టు దుర్బేధ్యంగా మారుతోంది. ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌కు వెళ్లడానికి మంచి అవకాశం కనిపిస్తోంది. టెస్టుల్లో దాదాపు రెండేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్‌.. వన్డేల్లోనూ నంబర్‌వన్‌ అయింది కానీ, దాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఖాతాలో 126 ర్యాంకింగ్‌ పాయింట్లుండగా.. భారత్‌ నాలుగు పాయింట్లు మాత్రమే తక్కువ ఉంది. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌కు ముందు ఆడబోయే వన్డే సిరీస్‌ ఒక్కటే. త్వరలోనే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ కంటే ముందే భారత్‌ నంబర్‌వన్‌ కావడానికి అవకాశముంది. అందుకు వెస్టిండీస్‌ మంచి ప్రదర్శన చేయాలి. ఇప్పటికే ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ గెలిచి ఊపుమీదున్న కరీబియన్‌ జట్టు.. దీని తర్వాత జరిగే వన్డే సిరీస్‌లోనూ విజయం సాధించాలి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో గెలిచినా చాలు.. భారత్‌ నంబర్‌వన్‌ అవుతుంది. అప్పుడు టీమ్‌ఇండియా పాయింట్లు 122గానే ఉంటాయి కానీ.. ఇంగ్లాండ్‌ పాయింట్లు 121కి పడిపోతాయి. ఒకవేళ ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ గెలిస్తే.. భారత్‌ కంగారూలతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టీమ్‌ఇండియా నంబర్‌వన్‌ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. భీకర ఫామ్‌లో ఉన్న భారత్‌.. నంబర్‌వన్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెడితే అంచనాలు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.