నందిగామ: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇవాళ పోలీసుల మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరించారు. జయరాం హత్యకేసులో రాకేశ్‌రెడ్డితో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్‌ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. డబ్బుల కోసమే పథకం ప్రకారం జయరాంను హత్య చేశారని తమ దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ వివరించారు.
‘‘రాకేశ్‌రెడ్డి హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. కుత్బుల్లాపూర్‌లోని జయరాం కంపెనీలో లాకౌట్ సమస్య వచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికా నుంచి జయరాం రాకేశ్‌రెడ్డికి ఫోన్ చేశారు. సమస్య పరిష్కారానికి శిఖా చౌదరికి సహకరించాలని రాకేశ్‌ను కోరారు. అలా వారి మధ్య కొన్నాళ్లు పరిచయం కొనసాగింది. ఆ తర్వాత జయరాం అమెరికా నుంచి రాగానే.. మహిళ పేరుతో సిమ్‌కార్డు తీసుకుని ఆయనతో చాటింగ్ చేశారు. గత నెల 30న జూబ్లీహిల్స్‌లో రాకేశ్‌రెడ్డి ఇంటికి రప్పించారు. జయరాంను బంధించి డబ్బుల కోసం రాకేశ్ వేధించాడు. తన వద్ద తీసుకున్న రూ.6కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశాడు. డబ్బుల కోసం జయరాంతో అతని స్నేహితులకు ఫోన్ చేయించారు. జయరాం కేవలం రూ.6లక్షలు మాత్రమే తెప్పించగలిగాడు.
గత నెల 31న ఉదయం వరకూ డబ్బుల కోసం వేచి చూశారు. డబ్బులు తీసుకురాకపోవడంతో జయరాంపై రాకేశ్‌రెడ్డి దాడి చేశాడు. జయరాం ముఖంపై రాకేశ్ బలంగా దాడి చేశాడు. రాకేశ్‌రెడ్డి కొట్టడంతో జయరాం సోఫాపై నుంచి కిందపడిపోయారు. సోఫాకు ముఖం అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశారు. వాచ్‌మెన్ సహాయంతో కారులో జయరాం మృతదేహం పెట్టారు. కారులో తీసుకొచ్చి నందిగామ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? లేదా? అనే విషయం దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో నుంచి బయట పడేందుకు రాకేశ్‌రెడ్డి కొందరు పోలీసుల అధికారుల సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది’’ ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ వివరించారు.
