బీట్ రూట్‌తో మెదడుకు మేలు.. ఇంకా చర్మానికి కూడా.. బీట్‌రూట్‌లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాయామం చేసేప్పుడు త్వరగా అలసిపోకుండా చూడటానికి, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి తోడ్పడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ చాలా శక్తిమంతమైంది. బీట్ రూట్ రసంతో రక్తపోటు తగ్గుతున్నట్లు గత అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది కూడా మెదడుకు మేలు చేసేదే కాబట్టి బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది. ఆక్సిజన్‌ను పెద్ద మొత్తంలో వినియోగించుకునే అవయవం మెదడు కావడంతో బీట్‌రూట్ మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేస్తుంది.
బీట్‌రూట్‌లోని నైట్రేట్ ముందు నైట్రైట్‌గానూ, అనంతరం నైట్రిక్ ఆక్సైడ్‌గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది అలాగే చర్మానికి కూడా బీట్ రూట్ మేలు చేస్తుంది. నాలుగు స్పూన్ల బీట్ రూట్ రసంలో నాలుగు చెంచాల పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలను కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఒక టీస్పూన్ బీట్ రూట్ జ్యూస్‌కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నిద్రకు ఉపక్రమించేందుకు ముందు చేస్తే చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఇంకా బీట్ రూట్ రసం, పంచదార మిశ్రమంతో చర్మానికి స్క్రబ్ చేస్తే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఇలా రోజూ బీట్ రూట్ రసాన్ని చర్మానికి పట్టిస్తే.. చర్మం కాంతిని సంతరించుకుంటుంది.