పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే నెయ్యి ఎక్కువగా తినమని చెబుతారు. అయితే పాలు, తాజా పళ్ల రసాలు నెయ్యికి చక్కటి ప్రత్యామ్నాయం. వీటిని తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. సమతులాహారం తీసుకుంటూ… పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, విటమిన్స్, ఐరన్, కాల్షియం లభించే ఆహారపదార్థాలతో పాటు తాజా పళ్లు, కూరగాయలు అధిక మొత్తంలో తీసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండే బచ్చలి, క్యాబేజీ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు లభిస్తాయి.
బిడ్డకు పాలిచ్చే తల్లులు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. వీరి కోసం వండే ఆహారపదార్థాల్లో మసాలాలు తగ్గించుకోవాలి. తాజాపండ్లు తీసుకోవడం వల్ల తల్లి పాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో బిడ్డ పాలు సరిపడినన్ని తాగడానికి వీలవుతుంది. వీటన్నింటితో పాటు తల్లి ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం కూడా అవసరమే. ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమయ్యే పాలు, గుడ్లు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు విటమిన్-ఎ ఎక్కువగా ఉండే క్యారెట్, గుమ్మడి వంటి కాయగూరలు తినాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఉడికించిన బఠాణీలు, బీన్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పొలెట్ అధికంగా లభ్యమయ్యే ఆకుకూరలు తినాలి. పండ్లు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల తల్లి నుంచి బిడ్డకు కావలసినన్ని పాలు దొరుకుతాయి.