సీబీఐ విచారణ కి “కోల్‌కతా సీపీ” హాజరు

0
37

శారద చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు విచారించారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో గట్టి బందోబస్తు మద్య విచారణ కొనసాగింది. సీబీఐ కార్యాలయం చుట్టూ భద్రతా బలగాలు మోహరించడంతో.. అక్కడి దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి. ముందుగా రాజీవ్ కుమార్‌ను ఇక్కడే విచారించి, అనంతరం మరో గుర్తు తెలియని ప్రదేశంలో విచారించనున్నట్టు అధికారులు తెలిపారు.

శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఆధారాలు మాయం చేసినట్టు కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజీవ్ కుమార్‌ను సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ కేసు విచారణలో సీబీఐకి సీపీ పూర్తిగా సహకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి అరెస్టు సహా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగరాదని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కారం పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కోల్‌కతా సీపీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, డీజీపీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.