తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ జలీల్ పై సస్పెన్షన్ వేటుకు ప్రభుత్వం సిద్ధమైంది. వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ ఉండగానే ఈవీఎంలు తెరిచారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. దీంతో వికారాబాద్ కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిచింది.
కేసు కోర్టులో ఉండగానే బెంగుళూరు నుంచి వచ్చిన బెల్ ఇంజనీర్లు ఆ నియోజకవర్గాలకు చెందిన 100కు పైగా ఈవీఎంలను కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేయడంతో వివాదం ముదిరింది. కేసు కోర్టులో ఉండగానే ఈవీఎం సీల్స్ తీయడంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వేటు వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయడంలో భాగంగానే తనిఖీలు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు.