భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలో తలపెట్టిన సభకు ప్రజల స్పందన అంతంతమాత్రంగానే వుంది. ఇంకా ఆయన రాకకు నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాకకు నిరసనపై బీజేపీ నేత, మాజీ సమాచార హక్కు కమిషనర్ విజయబాబు ఆరోపించారు.
సభలో వున్నవారికి పది రెట్లు ఎక్కువమంది రావాల్సి వుంది. కానీ సభకు మూడు కిలోమీటర్ల దూరంలోనే వేలాది మందిని నిలిపివేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేస్తుందో ఈ సభలో మోదీ తెలియజెప్పనున్నారని.. అదే టీడీపీ నేతల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోందని.. విజయబాబు ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో మోదీపై తీవ్రమైన ఆగ్రహం వుందని.. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేసేందుకే ఏపీలో పర్యటించాలని నిర్ణయించుకున్నారని.. నిరసనలన్నీ శాంతియుతంగా సాగాలని, ప్రజల్లో తమల్లోని ఆగ్రహాన్ని మోదీకి తెలిసేలా చేయాలని సూచించారు. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రతి ఒక్కరూ మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో రెండు కుండలను పగులగొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తన రాష్ట్రంపై యుద్ధం చేయడానికి మోదీ గుంటూరు వస్తున్నారని.. ఆయనకు ఏపీ ప్రజల నిరసన ఎలా వుంటుందో తెలియజేయాలన్నారు.