చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చిన దేవగౌడ.. మోదీని మించిన నటుడు లేడు

0
45

ఏపీకిచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ కేంద్ర వైఖరికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేశారు. ఈ పోరాటం దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగింది. ఈ దీక్షకు కూర్చున్న చంద్రబాబుకు మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు.

వివిధ జాతీయ పార్టీల నేతలు వచ్చి చంద్రబాబు దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు దీక్ష కొనసాగింది. ధర్మ పోరాట దీక్ష ముగింపు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

దేశం మొత్తం మనవెంటే ఉందని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు తెలియజేశామని అన్నారు. మోదీ హోదా ఇవ్వకున్నా తమదే నైతిక విజయమన్నారు. హోదా విషయమై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా వెళ్తామన్నారు. మోదీని మించిన నటుడు దేశంలోనే లేడని ఆయన విమర్శించారు.

దేశాన్ని దోచుకున్న దొంగలను విదేశాలకు పంపుతారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం నుంచి లక్ష కోట్లు రావాల్సి ఉందని, అవి వచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తామన్నారు. ఉదయం దీక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రారంభమైందని.. దీక్ష ముగింపునకు మాజీ ప్రధాని దేవెగౌడ రావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వచ్చారని చంద్రబాబు కొనియాడారు.