ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి..

0
63

టీమిండియా మాజీ కెప్టెన్, ధోనీపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఇటీవల ధోనీ కీపర్‌గా వున్న సమయంలో ఏ బ్యాట్స్‌మెన్ అయినా పెవిలియన్ దాటాడో అంతే సంగతులు అంటూ.. ఆయన ప్రపంచ క్రికెటర్లలో అత్యుత్తమ వికెట్ కీపర్ అంటూ కొనియాడింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ ధోనీకి 300వది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్ ధోనీ. అందుకు తగినట్లే ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైనా.. ఓ మెరుపు స్టంపింగ్‌తో తన మార్క్ చూపించాడు.

ఈ నేపథ్యంలో ఐసీసీ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించింది. వరల్డ్ ఫేమస్ బ్యాండ్ బీటిల్స్ కో ఫౌండర్, సింగర్ జాన్ లెనన్ పాడిన ఇమాజిన్ పాటను గుర్తు చేస్తూ ఐసీసీ వరుసగా ట్వీట్లు చేస్తూ వెళ్లింది. అంపైర్ లేని క్రికెట్‌ను ఊహించండి. అన్ని మ్యాచ్‌లు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి అంటూ ట్వీట్లు చేస్తూ వెళ్లింది.

ఇందులో ధోనీని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి. మిమ్మల్ని స్టంప్ లేదా క్యాచ్ ఔట్ చేయడానికి ఎవరూ ఉండరు. మీతో పరిహాసాలు ఆడటానికీ ఎవరూ ఉండరు అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఐసీసీ ధోనీపై చేసిన కామెంట్స్, ప్రశంసల ట్వీట్స్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.