బాబు దీక్ష‌కు వ్య‌తిరేకంగా సీపీఎం, సీపీఐ నేతల నిర్ణ‌యం

0
38

ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని సీపీఎం, సీపీఐ నేతలు నిర్ణయించుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేపట్టిన సమయంలో తమ పార్టీ కార్యకర్తలను చంద్రబాబు సర్కారు పోలీసులతో కొట్టించి, కేసులు పెట్టించిందన్నారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వారు పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు తరలివెళ్లారు. దీంతో ఏపీ భవన్ మొత్తం నిండి పోవడంతో కొందరు కేరళ హౌస్‌కు వెళ్లారు. సాధినేని యామిని శర్మ కూడా కేరళ హౌస్ నుంచి తెలుగుతల్లి గెటప్‌తో ఏపీ భవన్‌కు వచ్చారు. ఏపీ భవన్‌ ప్రాంగణంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష జరగనుంది.