నెలాఖరులోగా టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన

0
21

పార్లమెంట్ ఎన్నికల కసరత్తును టి కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఇప్పటికే అభ్యర్థల ప్రకటనపై ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వారు ఈ నెల 14 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి రాష్ట్ర పార్టీ అవకాశం ఇచ్చింది. కాగా ఇప్పటివరకూ 150 కి పైగా గాంధీభవన్‌కు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 17న దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవారి దరఖాస్తులను 25వ తేదీలోపు హైకమాండ్‌కు పంపించనున్నారు.

ఇక పార్లమెంట్ ఎన్నికలో సానుకూల ఫలితాలు వచ్చే విధంగా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 15, 16, 17వ తేదీలలో పార్టమెంట్ నియోజవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను పార్టీ నిర్వహించనుంది. 15న ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ ఇంచార్జ్ గా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజమాబాద్, వరంగల్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. 16న సలీమ్ అహ్మద్ ఇంచార్జ్ గా ఉన్న నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. ఇక 17న బోస్ రాజు ఇంచార్జ్ గా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి.

ఎన్నికలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని అసమర్ధ ప్రధానిగా మోడీని ఎండగట్టడం వల్ల పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని హస్తం పార్టీ స్కెచ్ వేస్తోంది. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశ ప్రగతి దిగజారిపోయిందని విమర్శలు చేయాలనుకుంటుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలను పరిష్కరిస్తారని ఆ వర్గాలు హామీ ఇస్తూ పార్లమెంట్ ఎన్నికలో ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని కాంగ్రెస్ ప్లాన్ వేస్తోంది.

ఇక పార్లమెంట్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎందుకు పనికి రాకుండా పోతుందనే ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరంగా చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థుల ప్రకటనను తొందరగా చేసుకుంటూ, బీజేపీని విమర్శించడం వల్ల తమకు పార్లమెంట్ ఎన్నికలో రాష్ట్రంలో సానుకూల ఫలితాలు వస్తాయని హస్తం పార్టీ లెక్కలు వేస్తోంది. మరి కాంగ్రెస్ నేతల స్కెచ్ ఎంత వరకు వర్క్ ఔట్ అవుతుందో రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.