చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సక్సెస్

0
25

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనపై ఘాటుగా విమర్శలు చేయడంతో చంద్రబాబు తన స్వరాన్ని పెంచారు. సీఎం చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్ష సక్సస్‌గా ముగిసింది. ధర్మపోరాట దీక్ష తర్వాత ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ టీడీపీ ముఖ్యనేతలతో ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతికి అందజేశారు. విభజన చట్టంలోని అంశాలు, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలను సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు.

ఢిల్లీలో దీక్షతో మోడీ, బీజేపీ విధానాలను ఎండగట్టామని చంద్రబాబు అన్నారు. జాతీయ స్థాయిలో ఏపికి జరిగిన అన్యాయాన్ని తెలిపామన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు టిడిపి దీక్ష వేదిక అయ్యిందని, 12గంటల ఢిల్లీ దీక్ష తమ పట్టుదలకు నిదర్శనమని తెలిపారు. 5కోట్ల ప్రజల హక్కులపై వైసీపీ, బీజేపీకి బాధ లేదని, ఏపీకి జరిగిన అన్యాయంపై ఆ పార్టీలు మాట్లాడవు అన్నారు. మోడీకి అవమానం జరిగిందని వైసీపీ బాధ పడుతోందని మండిపడ్డారు.

ప్రధాని మోడీలో నాయకత్వ లక్షణాలు లేవని, దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయం ఏమాత్రం ఆయనకు లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము న్యాయం కోసం పోరాడుతుంటే బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి జాతకాలు విప్పితే మళ్లీ తలెత్తుకుని తిరగలేరని హెచ్చరించారు.

రాష్ట్రపతి రాజ్యంగపరమైన అధినేత అని, అంతిమంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు. తమకు న్యాయం జరగకుంటే కోర్టు కెళతామని , అక్కడా న్యాయం జరగకుంటే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతోనే బీజేపీ కాలం వెళ్లదీస్తోందన్నారు. అందుకు రాష్ట్రంలో వైసీపీ సహకరిస్తోందన్నారు. రాష్ట్రంపై అంత చిత్తశుద్ధే ఉంటే టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.