ర‌స‌వ‌త్త‌రంగా మారిన నెల్లూరు రాజ‌కీయం

0
30

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జిల్లా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థుల సీటును ఖరారు చేసి అధిష్టానం ఆ పార్టీలో జోష్ పెంచింది. జిల్లాలోని 10
నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.

నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ అభ్యర్థులను మూడు నియోజకవర్గాలకు ఖరారు చేసినట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర వెల్లడించారు. నెల్లూరు జిల్లా నుంచి మంత్రి నారాయణ, రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల పేర్లు ఖరారు కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

మంత్రి నారాయ‌ణ ఎమ్మెల్సీగా ఎన్నికై, రాష్ట్ర మంత్రివ‌ర్గంలో చేరారు. దీంతో ఆయ‌న ఈ సారి ప్ర‌త‌క్ష్య ఎన్నిక‌ల్లో పోటీ చేసి, స‌త్తా చాటాల‌ని
భావిస్తున్నారు. ముఖ్యంగా అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, పాఠ‌శాల‌లు, వైద్యం, వాట‌ర్ స‌ప్లై వంటి మౌళిక వ‌స‌తుల‌ను
మెరుగుప‌రుస్తూ, నెల్లూరు అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి నారాయ‌ణ‌, త‌న సామాజిక వ‌ర్గంతోపాటు మిగిలిన సామాజిక వ‌ర్గాల‌ను త‌న‌వైపుకు తిప్పుకునేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మరోవైపు వైసీపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ టీడీపీ ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు చేస్తూ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తూ వ‌స్తున్నారు. అంతేకాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు అధికార పార్టీ చేస్తున్న అవినీతిని ఎండ‌గ‌డుతూ, వైసీపీ పార్టీ చేయబోయే సంక్షేమ, అభివృద్ధిని వివరిస్తూ అనిల్ కుమార్ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు.

నెల్లూరు రూర‌ల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేయడంతోపాటు, పాదయాత్రలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన కాకాణి, గ‌త నాలుగున్న‌రేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టును సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసిన మంత్రి సోమిరెడ్డి కేవ‌లం 5వేల ఓట్ల తేడాతో ఓట‌మి పాలయ్యారు. అయినప్పటికీ ఆయనకు ఉన్న అనుభవాన్ని గుర్తించి సోమిరెడ్డికి వ్యవసాయశాఖను అప్పగించి తగిన ప్రాధాన్యత ఇచ్చారు. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మంత్రి అయిన త‌రువాత నుంచి స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌దైన ముద్ర‌ను వేస్తూ వ‌చ్చారు.

మొత్తం మీద నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, నెల్లూరు రూర‌ల్‌, స‌ర్వేప‌ల్లి నియోజ‌వ‌ర్గాల్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం నెలకొంది. ఎన్నిక‌ల స‌మ‌యం దగ్గరపడుతుండటంతో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎత్తుల పై ఎత్తులు వేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ నుంచి ఇద్ద‌రు మంత్రులు, ఓ మాజీ మంత్రి పోటీ చేస్తుండ‌టం, విజయం ఎవ‌రిని వ‌రిస్తుందా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.