ప్రేమని అసహ్యించుకోకండి

0
79

నిరంతరం ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేసి మనస్సంతా అనిర్వచనీయమైన సంతోషాన్ని మిగిల్చే అద్భుతమైన అనుభూతి ప్రేమ..

Loveని Lustగా చూసే జనాలకు వయస్సులో ఉన్నప్పుడే ప్రేమ అర్థమవుతుంది! లవ్ ని Loveగా చూసే జనాలకు వయస్సు దాటిపోయాకా ప్రేమంటే గౌరవం మిగులుతుంది!!

చాటుమాటుగా శరీరాలు కలుపుకోవడం దగ్గరే ప్రేమ ఆవిరైపోతున్నప్పుడు నిజమైన ప్రేమ ప్రపంచానికి అర్థమయ్యే ఛాన్సెసే తక్కువ.

ఒక్క ఆలోచన చాలు.. టెలీపతీ లాంటిదేదీ లేకపోయినా సుదూరంలో ఉన్న ప్రేమమూర్తిలో ఆవ్యక్తానుభూతి కలిగించడానికి.. మనస్సు పులకింపజెయ్యడానికీ!

ఇవ్వాళ రేపు ప్రేమ డైల్యూట్ అయిపోతోందీ… ఆ డైల్యూషన్‌తో పాటే విలువనూ కోల్పోతోంది.. చులకన చేయబడుతోంది.

సోషల్ సెక్యూరిటీ దగ్గరా, ఆర్థిక స్థోమతల దగ్గరా, అందమూ, హోదాల దగ్గరా ప్రేమ పుడుతున్నప్పుడు.. పుట్టినంత వేగంగానే అది చచ్చిపోతోంది. నిజమైన ప్రేమపై నమ్మకాన్ని పోగొడుతోంది.

ప్రేమించడమంటే పెదాల పెదాల కలయిక దగ్గరకెళ్లడమే పరాకాష్టగా భావించే అపరిపక్వత మూలంగా ఆ రెండక్షరాల పదం అసహ్యించుకోబడుతోంది…

యెస్.. ఇవ్వాళ రేపు ప్రేమలో ఉన్న వాళ్లకు తప్పించి… మామూలు జనాలకు ప్రేమంటే అసహ్యం. ప్రేమలో ఉన్న జనాలు అంటరానివారిగానే తోస్తారు… ఏ పార్కుల పొదల మాటునో, మెట్రో స్టేషన్ లిఫ్టుల్లోన్లో ప్రేమ పేరుతో కామాన్ని చల్లబరుచుకునే ప్రయత్నాలు కళ్లబడుతున్నప్పుడు ఆమాత్రం చులకన ఏర్పడక ఏమవుతుంది?

పాలనురుగులా ఉప్పొంగి పెళ్లితో ముగిసిపోయేది కాదు ప్రేమ… పెళ్లయ్యాక ఒకర్నొకరు ద్వేషించుకుంటూ జీవితాన్ని గడిపేది కాదు ప్రేమ.

ప్రేమ మనకు సరిగ్గా అర్థం కావట్లేదు…

ఎలాంటి వాడు కావాలో, ఎలాంటి అమ్మాయి కావాలో సవాలక్ష ఊహలైతే ఉంటున్నాయి గానీ.. ఆ లక్షణాలన్నీ పక్కన పడేసి జీవితాంతం ప్రేమతో బ్రతికే విశాల హృదయం మాత్రం ఏ ఒక్కరికీ ఉండట్లేదు…

అందుకే ప్రేమలు షాపింగ్ మాల్స్‌లోనూ, చెట్ల పొదల మాటునా కంచికి చేరుతున్నాయి.. కొంత ప్రేమలు పుట్టుకొస్తున్నాయి..

ప్రేమని అసహ్యించుకోకండి.. ప్రేమని సరిగ్గా అర్థం చేసుకోలేని ప్రేమికులనే అసహ్యించుకోండి!! యెస్.. చాలాచోట్ల ప్రేమికులుగా చెప్పుకోబడుతున్న వారందరూ శరీరాలు ఎలా కలుపుకుందామా అని తహతహలాడేవారే తప్పించి.. కోరిక తీరిన రెండు మూడు నెలలకి వాళ్లు కలిసి ఉంటారా లేదా కూడా నమ్మకం లేని వ్యవహారం. ప్రేమ అనే పదం చులకన అవడానికి నిజమైన కారకులు వీరు! వీరి కోసం మరో పదం కనిపెట్టబడాలేమో!

రచన: నల్లమోతు శ్రీధర్