పిండాన్ని బయటకు తీసి ఆపరేషన్.. మళ్లీ గర్భంలో పెట్టేశారు!!

0
27

వైద్యులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన వైద్య నిపుణులు తాజాగా గర్భంలోని పిండాన్ని బయటకు తీసి భద్రంగా గర్భంలో పెట్టేశారు. ఇది విచిత్రం బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,

బ్రిటన్‌కు చెందిన సింప్సన్ అనే మహిళ ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. మూడేళ్ల క్రితం ఆమెకు కీరన్ అనే వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. తమకు పుట్టబోయే తొలిబిడ్డ కోసం భార్యాభర్తలిద్దరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇంతలో పిడుగులాంటి వార్త. ఆమె గర్భంలోని పిండం తల సరిగా పెరగడం లేదని పరీక్షలు చేసిన వైద్యులు వెల్లడించారు. ఇది స్పైనా బిఫిడా అనే వ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధితో బిడ్డ పుడితే బిడ్డ నడకపై ప్రభావం చూపుతుందని చెప్పారు. దీంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. అయితే, వైద్యులు మాత్రం ఈ సమస్యకు మూడు పరిష్కారాలు చూపించారు.

ఒకటి: ఎలాంటి చికిత్స లేకుండా పాపను కనడం. ఆ పిల్లలకు నడవడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. రెండు: గర్భం తొలగించుకోవడం. మూడు: అత్యంత అరుదుగా చేసే ఫెటాల్ శస్త్రచికిత్స. ఏం చేయమంటారు? అని ఆ దంపతులను అడిగారు. పుట్టబోయే బిడ్డ నడవలేకపోతే ఇబ్బందే. కానీ అందుకని ఆ బిడ్డని చంపుకోవడమూ ఇష్టం లేదు. అందుకే కొంచెం రిస్క్ అయినా పర్లేదని శస్త్రచికిత్సకే మొగ్గు చూపిందా జంట.

సింప్సన్ గర్భం దాల్చిన 24 వారాల తర్వాత ఈ శస్త్రచికిత్స చేశారు. గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్‌లో యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్ వైద్యులు, బెల్జియం నిపుణుల సహకారంతో ఈ ఆపరేషన్ చేశారు. దీనిలో భాగంగా సింప్సన్ గర్భంలోని పిండాన్ని బయటకు తీసి, దానికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తికాగానే ఆ పిండాన్ని తిరిగి సింప్సన్ గర్భంలో పెట్టేశారు. ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదని వైద్యులు తెలిపారు.