పుష్కర కాలంలో ఫస్ట్ టైమ్… ఆ రోజున 30 ఇండిగో సర్వీసులు రద్దు

0
25

దేశంలో అత్యంత చౌక ధరలకు విమాన సర్వీసులు ప్రారంభించిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్. ప్రస్తుతం ఈ సంస్థ కష్టాల్లో పడింది. పెరిగిన ఇంధన ధరలతో పాటు.. పైలెట్ల కొరత కారణంగా ఈ సమస్యలను ఎదుర్కొంటుంది. తాజాగా మార్చి 30వ తేదీన 30 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 12 ఏళ్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ చరిత్రలో ఇలా పెద్దసంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేయడం ప్రథమం.

ముఖ్యంగా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాల మధ్య రాకపోకలు సాగించే ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. ముంబై నుంచి చెన్నై, బెంగళూరు, గౌహతి, కోల్‌కతాలకు వెళ్లే ఇండిగో విమానాలను రద్దు చేశారు. విమాన పైలెట్ల కొరతను అధిగమించేందుకు విదేశీ పైలెట్లను కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమించాలని నిర్ణయించినట్లు ఇండిగో వెల్లడించింది.

విదేశీ పైలెట్ల నియామకానికి పౌర విమానయాన డైరెక్టరేట్ ఫారిన్ ఎయిర్ క్రూ టెంపరరీ అథరైజేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. బుధవారం 49 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి చెప్పారు. మార్చి నెల వరకు ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతుందని, ఏప్రిల్ నుంచి యథావిధిగా విమానాలు నడిపిస్తామని అధికార ప్రతినిధి వివరించారు.