సమాజానికీ, వ్యక్తికీ మధ్య సంఘర్షణ నిరంతరం ఉంటూనే ఉంటుంది

0
50

సోషియాలజీ ప్రకారం సమాజానికీ, వ్యక్తికీ మధ్య సంఘర్షణ నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఒక వ్యక్తిని సమాజం అంత సులభంగా ఆమోదించదు. సమాజాన్ని ఒక వ్యక్తి నిరంతరం తప్పు పడుతూనే ఉంటాడు, లేదా ఏకమొత్తంగా మార్చాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

ఇక్కడ సమాజం అనేది పలువురి వ్యక్తులతో కూడిన బలమైన శక్తి అనుకుంటే, ఒక వ్యక్తి ఆ సమాజాన్ని ఎదుర్కోవటానికి తన వద్ద ఉన్న శక్తియుక్తులు చాలా తక్కువ. అలాంటప్పుడు ఒకటే ఒక మార్గం ఉంది. కనీసం సమాజం అనేదాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా, తన ప్రయత్నం తాను చిత్తశుద్ధిగా చేయటం. సమాజం యొక్క ఆమోదం కోసమో, వ్యక్తుల యొక్క ఒప్పుకోలు కోసమో ఆగకుండా ప్రయాణించటం.

అలాగే చాలామంది సమాజం మొత్తాన్ని ఒకేసారి మార్చగలుగుతామని బలంగా నమ్ముతారు, దానికోసం విశ్వప్రయత్నం చేసి, ఆ తర్వాత నిరుత్సాహపడతారు. ఇక్కడ సమాజంలో కేవలం అతి కొద్దిశాతం మంది వ్యక్తులు మాత్రమే ఒక నిర్దిష్టమైన భావజాలాన్ని అర్థం చేసుకునే పరిపక్వత గానీ, వేవ్లెంగ్త్ గానీ కలిగి ఉంటారు. సమాజం మొత్తం ఒక వ్యక్తి భావజాలాన్ని ఉన్నది ఉన్నట్లు ఎలాంటి రెండో ఆలోచన లేకుండా ఆమోదించడం అసలు సాధ్యం కాని పని. అందుకే కొద్ది మంది వ్యక్తుల్లో ఆలోచన కలిగించగలిగినా ఒక వ్యక్తి యొక్క శ్రమ ఎంతో కొంత ఫలితం సాధించినట్లే తప్పించి నిరుత్సాహ పడాల్సిన పనిలేదు.

రచన: నల్లమోతు శ్రీధర్