అజ్ఞానాన్ని మూటగట్టుకుంటున్నాం

0
26

నిన్ను నువ్వు తెలుసుకుని, నేను అనే భావనను పూర్తిగా అధిగమించాలంటే – ఫిలాసఫీ.
నిన్ను నువ్వు దైవంతో లీనం చేసుకోవాలంటే – స్పిరిట్యువాలిటీ.
మనుషుల స్వభావాలు పరిశీలిస్తూ, థాట్ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తూ మనుషులపై లోతైన అవగాహన ఏర్పరుచుకోవడానికి – సైకాలజీ.
సమాజాన్ని అర్థం చేసుకుంటూ, అందులో అంతర్భాగంగా జీవించడం – సోషియాలజీ.
ఏది చట్టం, ఏది చట్టధిక్కరణం అనేది తెలుసుకోవడానికి – లా.
ప్రజా పాలన, వ్యవస్థలపై అవగాహన కలగడానికి – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
ఇలా పెద్ద మొత్తంలో సబ్జెక్టులు ఉన్నాయి, మనం ఆసక్తిగా నేర్చుకోవాలంటే..!!

కానీ, ఇవన్నీ వదిలేసి మనం.. జయరాం ఎలా చనిపోయారు.. సీరియల్ నటి ఝాన్సీ డైరీలో ఏముంది.. ఐదారు నెలల క్రితం మిర్యాలగూడ అమృత వాళ్ల నాన్న గురించి ఏమంది.. వంటి విషయాల పట్ల ఆసక్తి చూపిస్తూ, అలాంటి వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాం. ఎవరెలా బ్రతకాలనుకుంటారో వాళ్లు అలాగే ఉండిపోతారు అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదు.
దురదృష్టవశాత్తు పైన చెప్పిన వాటిలో కొన్ని సివిల్స్ కోసమో, గ్రూప్స్ కోసమో సబ్జెక్టులుగానే మిగిలిపోయాయి. మార్కుల కోసం చదివేవాళ్లు తప్పించి మిగతా వాళ్లు కనీసం వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేరు. అలాగే మరికొన్ని నమ్మకాలు, సిద్ధాంతాలు అనే స్థాయిలోనే ఇరుక్కుపోయాయి. ఆ భావనలు, సిద్ధాంతాలను ఎస్కేపిజంగా భావించే వారూ ఉన్నారు. ఏదేమైనా మనం జ్ఞానం అనుకుంటూ సెన్సేషనలిజం అనే అజ్ఞానాన్ని మూటగట్టుకుంటున్నాం, అసలైన జ్ఞానాన్ని కనీసం కవర్ విప్పడానికి కూడా ప్రయత్నించకుండా!

రచన: నల్లమోతు శ్రీధర్