అలా బ్రతికేస్తే…నిజమైన స్వేచ్ఛని ఎప్పటికీ అనుభవించలేవు.

0
49

రక్షించుకోవాలి.. కలాన్ని రక్షించుకోవాలి.. కులాన్ని రక్షించుకోవాలి.. ప్రాంతాన్ని రక్షించుకోవాలి.. పదవిని రక్షించుకోవాలి.. పార్టీని రక్షించుకోవాలి.. హక్కుల్ని రక్షించుకోవాలి.. దేశాన్ని రక్షించుకోవాలి.. ఇలా నిరంతరం అన్నీ రక్షించుకోవడం మీద యావత్ ప్రపంచపు జనాభా శక్తంతా హరించుకుపోతోంది.

ఓ రకంగా చూస్తే, స్వేచ్ఛగా, ఎగిరే పక్షుల్లా ఉండాల్సిన ఆలోచనలు కాస్తా.. కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, ఇంకా వేటి వేటినో రక్షించుకోవాలని సంకుచితత్వంతో ముడుచుకు పోతున్నాయి. “మన వర్గం వారు రాజ్యాధికారాన్ని సాధించాలి” వంటి మాటలు విన్నప్పుడల్లా పెదాలపై నాకు చిరునవ్వు వస్తూ ఉంటుంది. ఏముంది అక్కడ.. బూడిద తప్ప! నీ వర్గానికి రాజ్యాధికారం వస్తే నీకు వచ్చేదేంటి? నువ్విప్పుడు బతుకుతున్న దానికంటే భిన్నమైన బతుకు ఏదైనా నీకు లభిస్తుందా? ఇలాంటి సంకుచితమైన ఆలోచనలతో.. నువ్వు క్వాలిటీ లైఫ్ బతుకుతున్నావా, లేక మృతజీవిగా మిగిలి పోతున్నావా?

బోనులో కుదేసిన ఫౌల్ట్రీ కోళ్లలా తయారైపోతే ఎలా? రక్షించుకోవాలి.. రక్షించుకోవాలి.. అంటూ ఆ ఆర్తనాదాలేంటి? నీకేమైంది? బానే ఉన్నావు కదా, మూడు పూట్లా కడుపునిండా తింటున్నావు కదా? ప్రొటెక్టెడ్గా బ్రతికేస్తే, నిజమైన స్వేచ్ఛ ఎప్పటికీ అనుభవించలేవు.

నీతో పాటు ఈ సమాజంలో.. నీ పక్క కులం వాళ్లున్నారు, పక్క ప్రాంతం వాళ్ళు ఉన్నారు, పక్క దేశం వాళ్ళు ఉన్నారు, చివరికి మనకి ఎవరికీ అర్థం కాని పక్క గ్రహాల నుండి ఏలియన్స్ కూడా ఉండే ఉంటారు. ఇంత విశాలమైన ప్రపంచంలో ఒకచోట ముడుచుకుని.. జీవితం మొత్తం అదే రకమైన ఆలోచనలతో బతకటానికి ఎలా మనస్కరిస్తోంది?

యూట్యూబ్ వీడియోలు.. ఫేస్బుక్ మాస్ హిస్టీరిక్ పోస్టులూ.. టివిల్లో రంకెలు వేసుకుంటూ అరుచుకునే మేధావుల్నీ, పేపర్లలో వచ్చే సెన్సేషనల్ వార్తలను వదిలేసి.. ఒక క్షణం క్లీన్ స్టేట్లో ఆలోచించి చూడు.. అసలైన నువ్వు కనిపిస్తావు, అసలైన ప్రపంచం నీకు సాక్షాత్కరిస్తుంది.

చావుపుట్టుకలు మాత్రమే ఇక్కడ వాస్తవం.. వాటికి అతీతమైన మానసిక స్థితి కూడా ఉంది అనుకోండి. చావుపుట్టుకలు మినహాయించి, ఇక్కడ రోజు మనం మాట్లాడుకునేది అంతా, బుర్రలు బద్దలు కొట్టుకునేదంతా, పోరాటాలు చేసేదంతా అబద్ధం మాత్రమే. ఆ అబద్ధంలో బ్రతికినంత కాలం మనుషులకు ప్రశాంతత లభించదు.
కష్టపడి పని చేయి, కొత్త విషయాలు నేర్చుకో.. జీవితం అంటే ఏంటో అర్థం చేసుకో.. నలుగురితో మంచిగా ప్రవర్తించు.. కాస్త వినయం, విధేయత కలిగి ఉండు.. ఇలాంటివి ఫాలో అవ్వాలి గానీ… “నా కులాన్ని, నా హీరోనీ, నా లీడర్నీ, నా ప్రాంతాన్నీ, నా దేశాన్నీ నేను కాపాడుకుంటాను.. వాటి మీద ఈగ కూడా వాలనివ్వను, అవసమైతే బూతులు తిట్టడానికి కూడా వెనుకాడను” అని దిగజారిపోతే జీవితం ఏమవుతుంది?

చివరిగా ఒక్కమాట.. ఎక్కడ ఆలోచనలు స్వేచ్ఛగా విహరిస్తాయో అక్కడ జ్ఞానం పుష్కలంగా ఉంటుంది. ఎక్కడ ఆలోచనలు కుంచించుకుపోతాయో అక్కడ అజ్ఞానం రాజ్యమేలుతుంది. నీకు జ్ఞానం కావాలో, అజ్ఞానం, మూఢత్వం కావాలో నిర్ణయించుకో!!

రచన: నల్లమోతు శ్రీధర్