ప్రజల డబ్బు వృధా చేయడం ఎంతవరకు సమంజసం?

0
60

ఇప్పుడు నేను రాయబోయేది రాజకీయాల గురించి కాదు.. ఆర్థిక వ్యవస్థ గురించి!

మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, తాజాగా ఆంధ్ర బడ్జెట్ వివరాలు వింటున్నప్పుడు దాదాపు గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయా, తిరోగమనం వైపు నడిపిస్తున్నాయా అన్న సందేహాలు తలెత్తుతుంటాయి.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో ఒక వాక్యం నన్ను ఆవేదనకు గురి చేసింది. తల్లిగర్భంలో ఉన్నప్పటి నుండి చనిపోయే వరకు ఒక మనిషికి వివిధ రకాల సందర్భాల్లో రకరకాల స్కీమ్‌లను ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆర్థిక మంత్రి చాలా గర్వంగా చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ కావచ్చు, తెలంగాణ బడ్జెట్ కావచ్చు.. దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్లు కూడా దాదాపు ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా ఇలాంటివే వందలాది స్కీములు మొదలు పెడుతున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది ప్రభుత్వ ప్రయారిటీల్లో ఒకటిగా ఉండడంలో తప్పేమీ లేదు. కానీ, పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తామని.. బిడ్డ పుడితే డబ్బులు ఇస్తామని, బతుకమ్మ పండగొస్తే చీరలిస్తామనీ, మక్కా వెళుతుంటే ఖర్చుల భరిస్తామనీ.. ఇలా ఏవేవో కొత్త కొత్తవి క్రియేటివ్ గా ఆలోచించి మరీ ప్రజలు పన్నుల ద్వారా చెల్లిస్తున్న డబ్బుని వృధా చేయడం ఎంతవరకు సమంజసం?

సరే ఆ విషయం కాసేపు పక్కన పెట్టి, మూలాల్లోకి వెళితే ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలకు ప్రధానంగా వచ్చే ఆదాయ వనరులు..

వస్తుసేవలపై పన్నులు, దిగుమతి సుంకాలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలూ, ఇతర రంగాల ఉన్న జాతీయోత్పత్తి ద్వారా సృష్టించబడే సంపద.. ఆ సంపద నుండి వివిధ రూపాల్లో ప్రభుత్వానికి సమకూరే వాాటా! స్పెక్ట్రమ్ కేటాయింపులు, లైసెన్స్ ఫీజులు, వివిధ రంగాలకు సంబంధించి ఇతర రుసుములు ప్రజలు చెల్లించే ఆదాయపు పన్ను.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం.

వీటితోపాటు మరికొన్ని ఆదాయ వనరులు కూడా ఉంటాయి. ఇంతవరకు అర్థమైంది కదా! వస్తు సేవలపై పన్నుల విషయానికి వద్దాం. ఒక చిన్న టూత్ పేస్ట్ కొన్నా అందులో మనం టాక్స్ చెల్లిస్తున్నాం. 30 వేల రూపాయలు పెట్టి ఒక మొబైల్ ఫోన్ కొంటే 12 శాతం GST అంటే 3,600 కలుపుకుని 33,600 రూపాయలు చెల్లిస్తున్నాం. ఇలా రోజు మన ఆదాయంలో కనీసం 10 నుండి 20 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాం. ఇందులో మళ్ళీ కేంద్రం, రాష్ట్రం వాటాలు ఎటూ పంచుకుంటారు.

పైవన్నీ కలిపి భారీ మొత్తంలో కోట్లు ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది అనుకుందాం. తెలివిగల ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల మీద వాటిని వెచ్చిస్తాయి. అంటే రోడ్లు, భవనాలు, విద్య, ఆరోగ్యం, విద్యుత్, పోలీస్, రక్షణ రంగం.. ఇలా అనేక అంశాలు దీంట్లో వస్తాయి. వీటి మీద ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంతగా దేశం అభివృద్ధి చెందుతుంది, మిగతా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది.

కానీ ఇక్కడ మన ప్రభుత్వాలు.. బిడ్డ పుడితే డబ్బులు ఇస్తారు.. తుమ్మితే డబ్బులు ఇస్తారు.. పండగ వస్తే సరుకులన్నీ కలిపి తోఫాలు ఇస్తారు… కులాల వారీగా కార్పొరేషన్లు, వాటి కోసం ప్రత్యేకమైన భవనాలు నిర్మిస్తారు.. అంటే పరోక్షంగా జనాల్ని పరాన్న జీవులుగా మార్చిపారేస్తున్నారు! పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలట! ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వాలు వ్యవస్థలను బలోపేతం చేయడం మానేసి… వ్యక్తుల స్థాయిలో సంతృప్తిపరచుకుంటే వెళితే ఇంకా వ్యక్తులు ఎక్కడ ఎదుగుతారు? నిరుద్యోగ భృతి ఎందుకు? ఒకప్పుడు ఉద్యోగ అవకాశాలు పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడేమైంది..? కాస్త కష్టపడితే కచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. మరి అలాంటప్పుడు నెలకు 1000, 2000, 3000 రూపాయలు ఇస్తూ యువతని డిపెండెంట్లుగా, నిర్వీర్యం చేయడం ఎంతవరకూ కరెక్ట్?

మనుషుల్ని పెంచి పోషించడం ప్రభుత్వాల బాధ్యత కాదు. అది వ్యక్తుల, కుటుంబాల బాధ్యత! ప్రభుత్వాలు తాము చేయాల్సిన బాధ్యత వదిలేసి, జనాలకు పెళ్లిళ్లు చేస్తూ కూర్చుంటే సంక్షేమం మాట ఏమో గానీ.. పైన చెప్పుకున్న ఆదాయ వనరుల ద్వారా వచ్చిన డబ్బంతా వృధాగానే ఖర్చవుతూ ఉంటుంది. దేశం మరో 50 ఏళ్లు అయినా ఇలాగే బీదరికంలో ఉంటుంది.

ప్రభుత్వాలు తీసుకు వస్తున్న రకరకాల స్కీములు.. అసలు నిజమైన వ్యక్తులకు చేరుతున్నాయా లేదా అన్నది కూడా అతి పెద్ద పజిల్! మరి ఎవరిని ఉద్ధరించడానికి ఈ స్కీములన్నీ? కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, పార్టీల సానుభూతిపరులు, అనుచరులు, గల్లీ లీడర్లు ఈ స్కీముల పేర్లు చెప్పుకుని.. బాధ్యత కలిగిన మన లాంటి వ్యక్తులు చెల్లించే పన్నులను దోచుకు తినడానికా? దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? “ఇక ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండవు.. మీ బతుకు మీరు బతకండి… మీకు మంచి రోడ్లు వేస్తాం, నాణ్యమైన చదువులు ఉచితంగా చెప్పిస్తాం, మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తాం” అని ఏ ప్రభుత్వం చెప్పగలుగుతుంది? పతనమవుతున్న దేశాన్ని, సమాజాన్ని చూడలేక ఆవేదనతో రాసినది ఇది!