ఫుడ్ పారేయొద్దు… వివిధ ప్రాంతాల్లో ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు

0
40

గ్రేట‌ర్ ప‌రిధిలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేపడుతున్న జిహెచ్ఎంసి స‌రికొత్త‌గా “ఫీడ్ ద నీడ్” అనే కార్య‌క్ర‌మ‌న్ని ప్రారంభించింది. ఐదు రూపాయ‌ల‌కే అన్నం పెడుతున్న బ‌ల్దియా… అభాగ్యుల‌కు అన్నం పెట్టేలా ప్లాన్ చేసింది. అందుకోసం సిటిలోని వివిధ ప్రాంతాల్లో ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేసి మిగిలిపోయిన ఆహారాన్ని అవసరం ఉన్నవారికి అందించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇప్ప‌టికే శిల్పారామం వ‌ద్ద ఫిడ్ ద నీడ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసిన బ‌ల్దియా…, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వ‌ద్ద మ‌రో ఫ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసింది. జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, క‌మిష‌న‌ర్ దాన కిషొర్‌లు ఈ సెంట‌ర్‌ను ప్రారంభించారు. ఫ్రిడ్జ్ ల‌లో ఒక‌వైపు వెజ్ మ‌రో వైపు నాన్ వెజ్ ఫుడ్ భ‌ద్ర‌ప‌రిచేలా ఏర్పాటు చేశారు.

నగరంలో ఇప్ప‌టికే 150సెంట‌ర్ల‌లో 5రూపాయ‌ల భోజన కేంద్రాల‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌తి రోజు 40వేల మంది ప్ర‌జ‌లు త‌మ ఆక‌లిని తీర్చుకుంటున్నారు. అయినా చాలా మంది ఇంకా ఆక‌లితో అల్లాడుతున్నారు. అలాంటి వారికి ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా చేసేందుకే ఫీడ్ ది నీడ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. త‌మ ఎస్టాబ్లిష్మెంట్ వ‌ద్ద మిగిలిపోయిన ఫుడ్‌ను స‌మీపంలోని కేంద్రాల వ‌ద్ద ఉంచాల‌ని అక్క‌డ అవ‌స‌రం అయిన వారు వాటిని తింటార‌న్నారు. “ఫీడ్ ది నీడ్” కేంద్రాల‌కు ఉచితంగా నిరుపేద‌ల‌కు నాణ్య‌మైన భోజ‌నాన్ని అందిచ‌నున్న‌ట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మ‌రింత పెద్ద ఎత్తున ఫీడ్ ది నీడ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి.. ఫుడ్ స‌ప్ల‌య్ చేస్తామ‌ని ఆయన అన్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీగా ఫుడ్ వేస్ట్ అవుతుంద‌ని… వండిన ఆహారం పాడు చేయడం సరికాదని మేయ‌ర్ బొంతు రామ్మోమన్ చెప్పారు. తిండిలేని వారు కూడా నగరంలో ఉన్నార‌ని వారి ఆక‌లి తీర్చ‌డానికే ఫిడ్ ది నీడ్ కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశామన్నారు. నగరంలోని ప‌లు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫీడ్ ద నీడ్ కు మంచి స్పంద‌న వ‌స్తోందన్నారు. ఇలాంటి కేంద్రాలు పెట్ట‌డం వ‌ల్ల‌.. పేద ప్ర‌జ‌ల‌కు స‌పోర్ట్‌గా వుంటుంద‌ని సిటిజన్లు చెబుతున్నారు.