దేశభక్తి.. ప్రేమా.. కష్టం!

0
65

ఒక ప్రేమికుడు.. దూరమైన అమ్మాయి గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటున్నాడు. ఆ అమ్మాయి మీద ప్రేమ ఎంత ఉందో తెలియదు గానీ.. ఆలోచించకపోతే తనకు హృదయం లేదు అనే ముద్ర పడుతుందని, జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మరీ తెగ ఫీలవుతున్నాడు.

ఒకతనికి పెద్దదో చిన్నదో ఓ కష్టమొచ్చింది. అదే పనిగా ఆలోచిస్తున్నాడు. పక్కన అతని స్నేహితులు.. “ ఎప్పుడు అదే ఆలోచిస్తూ కూర్చుంటావేంటి” అని విసుక్కుంటుంటే.. “నా బాధ మీకు అర్థం కాదు, నా పరిస్థితిలో మీరు ఉంటే అప్పుడు తెలుస్తుంది” అంటూ నిష్టూరమాడుతున్నాడు. అతని మీద అతనికి ఒక సానుభూతి ఉంది. తన కళ్ళ ఎదురు తిరిగే వారంతా చాలా సుఖసంతోషాలతో ఉన్నట్లు, తాను మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినట్లు సెల్ఫ్ పిటీ. మనుషులు, పరిస్థితులు, దేవుడు అందరూ కలిసి తను ఒక్కడినే అన్యాయం చేసినట్లు ఓ నిస్సహాయత. దాంట్లో అతను చేయాల్సింది చేయకుండా ఎస్కేప్ అవుతూ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నానన్న ఆలోచన కూడా లేదు. ఒక వ్యక్తి తన మీద తాను కురిపించుకునే సానుభూతి, గొప్ప విజయం కన్నా పరోక్షంగా చాలా సంతృప్తిని ఇస్తుంది. అందుకే చాలామంది ఆ మెంటల్ స్టేట్ నుండి బయటకు రారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సైన్యం మీద దాడి జరిపారు. దేశం మొత్తం అట్టుడికిపోతోంది. సోషల్ మీడియా నిండా అవే పోస్టులు. కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. కేవలం మాస్ హిస్టీరిక్‌గా ఎమోషనలైజ్ అయి దాని గురించి రాయటం అతనికి ఇష్టం లేదు. సోషల్ మీడియాలో ఆవేశం వెళ్లగక్కడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా అతనికి అర్థం కాలేదు. అందుకే తన వంతుగా సైన్యానికి కొంత మొత్తం డొనేట్ చేసి కామ్‌గా కూర్చున్నాడు. రెండు రోజులు దాటినా సోషల్ మీడియాలో ఆవేశం తగ్గలేదు. అతనికి ఏమాత్రం దేశభక్తి లేదని చాలామంది డిసైడ్ అవుతూ వచ్చారు. ఆ వత్తిడి తట్టుకోలేక తానూ ఓ ఫైన్ మార్నింగ్ ఆ అంశం మీద ఆవేశంగా రాసేశాడు. ఏదో ఒకటి నోరు తెరిచి మాట్లాడితే తప్పించి “దేశభక్తి” లేదనే ఓ సంకుచిత భావజాలానికి అతనూ బలయ్యాడు.

ఎమోషనల్ బ్యాలెన్సింగ్.. ప్రాక్టికల్ దృక్పధం.. ఈ రెండూ ఈ మధ్య సమాజంలో లోపిస్తున్నాయి. అవసరం లేని ఒక బ్యాడ్ ఎమోషన్ మనకు గానీ, సమాజానికి గానీ మేలు చేయడం కన్నా హాని ఎక్కువ చేస్తుంది. నా అంచనా ప్రకారం.. గత రెండు మూడు రోజులుగా, చాలామంది మెంటల్ స్టేట్ డిస్ట్రర్బ్‌గా ఉంది. “చంపేయాలి.. ఉరితీయాలి.. యుద్ధం చేసి పాకిస్తాన్‌ని ఓడించాలి” అనే ఆవేశం. దీనివల్ల చాలామంది వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండలేకపోతున్నారు, చేసే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. మొత్తానికి ఒక మనిషి ప్రొడక్టివిటీ, హాపీనెస్ స్కేల్ ఇలాంటి సంఘటనలతో దారుణంగా తయారవుతున్నాయి. ఇక్కడ.. మనకు దేశభక్తి ఉంది కాబట్టి కచ్చితంగా ఆవేశ పడాలి అన్నది మనకు మనం, సమాజం దృష్టిలో మనం వేసుకునే మేకప్ మాత్రమే. పది రోజులు పోతే ఈ విషయం ఎవరికీ గుర్తుండదు. ఒక సంఘటన జరిగినప్పుడు ఇన్స్టెంట్‌గా వచ్చే ఎమోషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

ప్రాక్టికల్‌గా ఈ విషయంలో మనమేం చేయగలుగుతాం? ఆర్మీ ఫండ్‌కి కొంత మొత్తంలో డబ్బులు పంపగలుగుతాం. అది చేసి కామ్‌గా ఎందుకు ఉండలేం? మనం ఆవేశపడినా, పడకపోయినా ప్రభుత్వాలు, రక్షణ శాఖలు వాటి పని అవి చేసుకుంటూ పోతూనే ఉంటాయి. మన ఆవేశం వల్ల మన మానసిక, శారీరక ఆరోగ్యాలు, మనుషుల మధ్య సంబంధాలు మాత్రమే కదా పాడవుతోంది? ఇది అర్థం కావడానికి చాలా మెచ్యూరిటీ కావాలి. ఇక్కడ మరో విషయం చెబుతాను.. తెలుగు సినిమాలు చాలా మంది చూస్తూనే ఉంటారు. విలన్ హీరో వాళ్ల బాబాయినో, ఇంకెవర్నో చంపేస్తాడు. దానికి ప్రతిగా హీరో విలన్ గ్యాంగ్‌ని చితగ్గొట్టేస్తాడు. అది తట్టుకోలేక విలన్ పగపట్టి హీరో కుటుంబం మొత్తాన్ని వాళ్లు నిద్రిస్తుండగా మంటల్లో కాల్చేస్తాడు. ఇక్కడ హింసకు హింసే సమాధానంగా ఉంటే.. ఉగ్రవాద దాడులకి యుద్దాలే తగిన సమాధానాలని మనం ఆవేశంతో ఊగిపోతే.. యుద్ధం ఎప్పుడూ శాశ్వత పరిష్కారం కాదు. అదే పరిష్కారమైనట్లయితే.. ఇన్ని దశాబ్దాల పాటు మనం ఇంత ప్రశాంతంగా బతికే వాళ్ళం కాదు. నిరంతరం పక్క దేశంతో కొట్టుకు ఛస్తూనే ఉండే వాళ్లం.

మొదట్లో చెప్పిన అబ్బాయి ప్రేమ సంఘటన కావచ్చు.. రెండో సంఘటనలో కష్టాల్లో ఉన్న మనిషి కావచ్చు.. దేశభక్తి కావచ్చు.. ఈ మూడింటి విషయంలో ఒకటే కామన్‌గా ఉంటోంది. ఒక ఎమోషన్‌ని బలవంతంగా క్యారీ చేయడం! తాను గొప్ప ప్రేమికుడిని అని నిరూపించుకోవడం కోసం… గెడ్డాలు పెంచుకోవడం, తన ఒక్కడికే కష్టాలు ఉన్నాయని భ్రమించడం కోసం మనుషులతో కలవకుండా నాలుగు గోడల మధ్య బతికేయడం, తనకు మాత్రమే దేశ భక్తి ఉందని ప్రపంచానికి నిరూపించుకోవడం కోసం ఆవేశం వెళ్లగక్కడం.. ఇవన్నీ ఒక వ్యక్తిని తనకి తాను కాకుండా చేస్తున్నాయి.

చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను.. ఒక ఎమోషన్ ఎప్పుడూ మనల్ని డామినేట్ చేయకూడదు. ఎమోషన్‌ని అవసరమైన చోట ఒక టూల్‌గా వాడాలే తప్పించి, ఎమోషనలైజ్ అయితేనే మంచోళ్లం, గొప్పోళ్లం వంటి ఫాల్స్ నమ్మకాల్లో కొనసాగుతూ పోతే నష్టపోయేది మనమే!

గమనిక: ఇది నా అభిప్రాయం మాత్రమే, డిబేట్ కాదు. ఇందులో దేశభక్తి లాంటి సున్నితమైన అంశాలను ప్రస్తావించడం వలన, వాటిపై మీకు విభిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. వాటిని సంతోషంగా మీ టైమ్‌లైన్‌లో రాసుకోవచ్చు. ఇక్కడ మాత్రం సుదీర్ఘ చర్చలు పెట్టకండి, రిప్లై లు ఇచ్చే సమయం నాకు ఉండకపోవచ్చు.

రచన: నల్లమోతు శ్రీధర్