ఆన్‌లైన్ ఫుడ్ హానికరమా..?

0
32

ఆఫర్లు ఉన్నాయని నమ్మి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్విగ్గీ, జొమాటో, ఉబెర్ ఈట్స్, ఫుడ్ ఫాండా లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. యాప్‌ను కొత్తగా వాడే వారికి మొదటి మూడు ఆర్డర్లు 50 శాతం తగ్గింపు, ఆపై వీకెండ్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్‌తో జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఆఫర్ ఉంది కదా అని తెలియని హోటళ్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఫుడ్ క్వాలిటీ బాగుండకపోవడం, తినడానికి బాగున్నా తర్వాత ఇబ్బందులు వస్తున్నాయని కస్టమర్లు చెబుతున్నారు.

ఏ హోటల్, రెస్టారెంట్ అయినా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను పాటించాలి. కస్టమర్లు వెళ్లే హోటల్‌‌లో ఫుడ్‌లో నాణ్యత లోపిస్తే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే డెలివరీ యాప్స్ వచ్చాక ఫుడ్ అందించే రెస్టారెంట్లు పెరిగిపోయాయి. దీంతో చాలామంది అందుకు అలవాటు పడిపోయారు. ఒక్కసారి ఆర్డర్ చేశాక ఫుడ్ బాగున్నా బాలేకున్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు.

యాప్ డెలివరీలకు డిమాండ్ పెరగడంతో.. రెస్టారెంట్ల వారే యాప్‌లలో నమోదు చేయించుకుంటున్నారు. ఇలా నమోదు చేయించుకునేవాటిల్లో ప్రముఖ హోటళ్లతో పాటు చిన్నాచితక హోటళ్లు కూడా ఉంటున్నాయి. ఈ సమయంలో వాటికి అనుమతులు ఉన్నాయా..? లేదా..? ఆహార నాణ్యత నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా..? అన్నది చూడకుండా యాప్‌లో చేరుస్తున్నారు. మరోవైపు డెలివరీ బాయ్స్‌ని తీసుకునేటప్పుడు లైసెన్స్ ఉందా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది
పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అలాగే యాప్ లలో కనిపించే కొన్ని హోటళ్లను నేరుగా వెళ్లి చూస్తే అనుకున్నంత బాగా ఉండటం లేదని పలువురు కస్టమర్లు చెబుతున్నారు.

ఫుడ్ యాప్స్ లో ముందుగా హోటళ్లు, ఫుడ్ ఫోటోలను చూసి, తర్వాత వాటి రేటింగ్ చూసి ఎక్కువమంది ఆర్డర్లు ఇస్తుంటారు. అయితే వాటి రేటింగ్ తీరు అంత నమ్మకంగా ఉండటం లేదు. చెత్త రెస్టారెంట్లకు కూడా 5 స్టార్స్ రేటింగ్ చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు ఫుడ్ డెలివరీ తర్వాత ఆ రెస్టారెంట్ల నుంచి బిల్ కూడా రావడం లేదు. దీంతో మనం ఆర్డర్
చేసిన రెస్టారెంట్ నుంచే ఫుడ్ వచ్చిందో లేదో తెలుసుకునే అవకావం ఉండదు. అలాగే ప్రముఖ రెస్టారెంట్ల పేర్లతో డమ్మీ రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి.

బావర్చి పేరుతో ప్రముఖ రెస్టారెంట్ ఉండగా ఈ పేరుకు ఏదో ఒక పదం చేర్చి కొన్ని వందల రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి. యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏ బావర్చి పేరున్న రెస్టారెంట్ నుంచి ఫుడ్ వచ్చిందో తెలుసుకోవడం కష్టమే.
ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుండటంతో కొందరు ఫుడ్ యాప్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుడ్ బాగోలేదన్న ఫిర్యాదు వస్తే డబ్బు రిఫండ్ చేయడం, మళ్లీ డెలివరీ చేయడం లాంటివి చేస్తున్నారు.

ఇక కొన్ని యాప్‌లో థర్డ్ పార్టీ ఏజెన్సీలతో హోటళ్లలో తనిఖీలు చేయించి సొంత రేటింగ్ ఇస్తున్నారు. ఇది కొంత ఉపయోగమే అయినా ఈ రేటింగ్ లు కొన్ని హోటళ్లకే కనిపిస్తున్నాయి. దీంతో మిగతావాటి పరిస్థితి వినియోగదారులకు తెలిసే అవకాశం లేదు. ఏం చేసినా యాప్ ల పాత్ర సర్వీస్ కే పరిమితం. ఫుడ్ నాణ్యతను, రెస్టారెంట్ల నిర్వహణను పరిశీలించడం, సమస్య వస్తే పూర్తిస్థాయి బాధ్యత తీసుకునేది ఎవరన్నాది మాత్రం స్పష్టత లేదు.