పాకిస్థాన్‌ను మూడు ముక్కలు చేయాల్సిందే : రాందేవ్ బాబా

0
66

పుల్వామా ఉగ్రదాడిపై ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంభించాల్సిందేనని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్‌లో బలూచిస్థాన్, పాకిస్థాన్ నైరుతి భాగాల్లో కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు భారత్ మద్దతు ఇవ్వాలని, తద్వారా పాకిస్థాన్‌ను దెబ్బకు దెబ్బ తీయాలని పిలుపునిచ్చారు.

బలూచిస్థాన్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న యోధులకు భారత్ ఆర్థిక, ఆయుధ, రాజకీయ సాయం అందించాలని, బలూచిస్థాన్‌కు విముక్తి కల్పించేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలని అని రాందేవ్ విజ్ఞప్తి చేశారు.

అసలు ఇవన్నీ కాదు కానీ, మొదట పాకిస్థాన్‌ను మూడు ముక్కలు చేస్తే సరి అని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా 50,000 మంది సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి రోజూ బాధపడడం కంటే ఓ యుద్ధం చేస్తే మేలని అన్నారు బాబా రాందేవ్.

‘ఆ యుద్ధం ఎలా ఉండాలంటే మరో 50 ఏళ్ల పాటు పాకిస్థాన్ మనవైపు చూడాలంటేనే వణికిపోవాలి’ అని పేర్కొన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలని, మనదేశంలో వేర్పాటువాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌లోనూ భారత్ వేర్పాటువాదాన్ని ఎగదోయాలని సూచించారు.