తల్లిదండ్రులూ … మీ పిల్లలపై ఇలా ఒత్తిడి చేస్తున్నారా?

0
65

చాలా మంది విద్యార్థుల్లో పరీక్షల తేదీ చాలా దగ్గరపడేంతవరకు చలనమే కనిపించదు. మరికొందరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు మాత్రం పరీక్షల తేదీ ప్రకటించిన తర్వాత నిద్రహారాలుమాని అహోరాత్రులు చదువు మీదే లగ్నమైపోతారు. ఇలా చేయడం చేయడం వల్ల చిన్నారులు తీవ్రమైన ఒత్తిడికి లోనైపోతారు. ఎందుకంటే అప్పటివరకు సాధారణ శ్రమకే పరిమితమైన విద్యార్థులు… ఒక్కసారి హఠాత్తుగా ఆ శ్రమను రెట్టింపు చేసేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఫలితంగా వారు తీవ్రమైన అసలట, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. తద్వారా కళ్ళపైనా, మెదడుపైనా విపరీతమైన ఒత్తిడి వల్ల అవి అశక్తంగా మారిపోతాయి. ఆబగా తింటే ఆయాసం వచ్చినట్టుగా అదరాబాదరాగా చదివితే మనసు విపరీతంగా అలసిపోవడమే తప్ప ఉపయోగం ఉండదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

నిజానికి పిల్లలు అతిగా ఆరాటపడటానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల ఒత్తిడే. మొదటి పది స్థానాల్లో ర్యాంకు రావాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం వల్ల వారు తీవ్ర మనోవేదనకు గురవుతారు. వాస్తవానికి చదువు విషయంలో తీవ్రత అనేది ఒక్కసారిగా పెంచకూడదు. అది క్రమానుగంగా పెంచాలి. ప్రతి రోజూ చదివే సమయాన్ని పెంచుతూ పోవాలి. ఉదాహరణకు మొదటి రోజు ఓ గంట, రెండో రోజు రెండు గంటలు ఇలా రోజురోజుకూ పెంచుతూ పోవాలి. అంతేకానీ, హఠాత్తుగా ఒకేసారి ఐదు లేదా ఆరు గంటల పాటు చదవటానికి పూనుకుంటే మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక శరీరమూ, మెదడు కొద్ది రోజుల్లోనే డీలాపడిపోతాయి. ఇలా చేయడం వల్ల శారీరకంగానేకాకుండా మానసికంగా కూడా కుంగిపోవాల్సి ఉంటుంది. సో… తల్లిదండ్రులూ.. పరీక్షల సమయం దగ్గరపడిందికదాని.. పిల్లలపై తీవ్ర ఒత్తిడి చేసి అహోరాత్రులు పుస్తకాల పురుగులా మార్చొద్దు.