అమరులకే ఆస్ట్రేలియా సిరీస్ అంకితం.. షమీ ధీమా

0
31

పుల్వామా దాడుల నేపథ్యంలో అమరుల కుటుంబాలకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. అమరజవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలవడంలో, మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంలో టీమిండియా క్రికెటర్లు మాత్రం ఒకడుగు ముందు వున్నారు. వీరిలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు వున్నారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ సైతం అమరుల కుటుంబాలకు రూ. 5లక్షల ఆర్థికసాయం ప్రకటించాడు. ఇంకా పుల్వామా దాడిపై షమీ మాట్లాడుతూ.. త్వరలో భారత్ ఆడబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలిచి తీరుతామని… ఆ విజయాన్ని అమరులకు అంకితం చేస్తామని వ్యాఖ్యానించాడు. తాము దేశం కోసం క్రికెట్ ఆడుతుంటే, దేశసరిహద్దుల్లో రక్షణగా ఉండేది సైనికులేనన్నాడు. వారు మనకోసం చేస్తున్న త్యాగానికి బదులుగా రుణం తీర్చుకునే బాధ్యత భారతీయులందరిపైనా ఉందని షమీ అన్నాడు. 24 గంటల పాటు సరిహద్దుల్లో కాపలా కాస్తూ భారతీయుల రక్షణ కోసం పాటుపడే వారి కోసం త్వరలో ఆడబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలిచి తీరుతామని చెప్పాడు. ఆ విజయాన్ని అమరజవాన్లకు అంకితం ఇస్తామని చెప్పాడు. టీమిండియా ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఐదు మ్యాచ్‌ల వన్డేసిరీస్‌లను ఆడనుంది.