పుల్వామా ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత్ జలాస్త్రం

0
45

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ వివిధ రకాల దౌత్య అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ దేశం పేరును అత్యంత అభిమాననీయ దేశాల (ఎంఎఫ్ఎన్) జాబితా నుంచి తొలగించింది. అలాగే, పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకలా వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 200 శాతానికి తగ్గించింది. ఇపుడు జలాస్త్రాన్ని ప్రయోగించింది. మన నీళ్లు మనకే అనే సిద్ధాంతాన్ని అమలు చేయనుంది. ఇందులోభాగంగా, పాక్‌లోకి వెళ్లే మన వాటా నీళ్లు మన రాష్ట్రాలకే మళ్లించనున్నారు. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ఈ నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ, ‘తూర్పు నదుల్లోని మన వాటా నీటిని పంజాబ్‌, జమ్మూకాశ్మీర్‌లకు మళ్లించాలని నిర్ణయం తీసుకున్నాం. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో షాపూర్ – కండీ వద్ద ప్రాజెక్టును ఇప్పటికే నిర్మిస్తున్నాం. కాశ్మీర్‌లోని కఠువాలో ఉజ్‌ నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల మన వాటా నీటి నిల్వ సాధ్యపడుతుంది. కాశ్మీర్‌ అవసరాలకూ సరిపోతుంది.

మూడోది రావి-బియాస్‌ లింక్‌ రెండో కాలువ ప్రాజెక్టు. జాతీయ ప్రాజెక్టులుగా ఈ మూడు నిర్మాణాలను వేగవంతం చేస్తాం. వీటిని కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం. పంజాబ్‌ నుంచి నీటిని యమునలోకి పంపుతాం. తద్వారా యమునలో నీటి లభ్యత పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం సింధు జలాలను సాధ్యమైనంత ఎక్కువగా మనమే వాడుకొనేలా బృహత్తర ప్రణాళిక ఉంది’ అని గడ్కరీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

‘మన వాటా నీటిని మనకే మళ్లించుకోవడం వల్ల పాక్‌లో నీటి లభ్యత తగ్గుతుంది. వారి తాగు, సాగునీటి అవసరాలకు గట్టి దెబ్బ తగులుతుంది. షాపూర్‌-కండీ ప్రాజెక్టు గనుక పూర్తయితే పంజాబ్‌, కాశ్మీర్‌ల్లోని సరిహద్దు జిల్లాలైన గురుదాస్‌పూర్, కఠువాలకు పుష్కలంగా నీరు అందుతుంది. కాశ్మీర్‌లో మిగులు జలాలను పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లు వాడుకుంటాయి. ఈ ప్రాజెక్టును అర్థ శతాబ్దంపాటు ఎందుకు చేపట్టలేదో కాంగ్రెస్‌ బదులు చెప్పాలి’ మంత్రి, ఉధంపూర్‌ ఎంపీ జితేంద్రసింగ్‌ ప్రశ్నించారు.