సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని, హోదా ఇవ్వకుండా ఏ శక్తీ తమను అడ్డుకోలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన భరోసా సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా 125 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇచ్చింది సాధారణ వ్యక్తి కాదని, దేశ ప్రధాని అని గుర్తు చేశారు. ప్రధాని ఇచ్చిన హామీ అంటే దేశం ఇచ్చిన హామీ అని, పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత లేదా? అని అడిగారు.
మోదీ ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలన్నీ అబద్ధమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి మాట తప్పిన మోదీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేసేందుకు మోదీకి మనసు రావట్లేదని, బడా వ్యాపారవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఎద్దేవా చేశారు.