అయ్యా.. ఆ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు.. నాకేం పాపం తెలీదు..

0
45

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీలపై ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలోని వ్యాఖ్యలను చూసిన ప్రజలు చింతమనేనిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోపై చింతమనేని వివరణ ఇచ్చారు.

ఎస్సీలకు, తనకు మధ్య అగాధం సృష్టించాలని వైఎస్ జగన్ చూస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. ఆ వీడియో బూటకమని.. దళితులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని, తన మాటలను వక్రీకరించారని స్పష్టం చేశారు.

కొంత మంది వ్యక్తులకు మద్యం సరఫరా చేసి తన మీటింగ్‌ని అపఖ్యాతిపాలు చేసేందుకు వాళ్లను అడ్డుపడమని పురమాయించారని, వాళ్లను మందలిస్తున్న సందర్భంలో తాను ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నటువంటి వీడియోను ఎడిట్ చేసి 30 సెకండ్లు చూపించేలా చేశారని ఆరోపించారు. ఒకవేళ ఈ 30 సెకన్ల వీడియో చూసి ఎవరైనా బాధపడి ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. తప్పు చేసింది తాను కాదని.. వైకాపా మనుషులేనని చెప్పారు.

ప్రజాక్షేత్రంలో తనను దోషిగా నిలబెట్టారు కనుక వాళ్ల తరపున కూడా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. పూర్తి వీడియోను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలని కోరారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారు పడతారంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు.

దళితులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని నిరూపిస్తే కనుక రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం తాను రాజకీయాలు చేయడం లేదని, తనను ఎదుర్కొనేందుకు కుట్ర రాజకీయాలు చేయడం సరికాదని, రాజకీయ దివాళాకోరు తనానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పుకొచ్చారు.

ఇంకా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ దళితులపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేక అర్థం వచ్చేలా ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెదపాడు మండలం తోటగూడెం వాసి, వైసీపీకి చెందిన కత్తుల రవికుమార్‌ను అరెస్టు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.