ఆస్ట్రేలియాతో ఓడినా… 500 పరుగుల రికార్డు సృష్టించిన కోహ్లీ

0
83

ఆస్ట్రేలియాతో తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే చివరి వరకు టీమిండియా విజయం కోసం పోరాడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో ఓడినా.. తన ఖాతాలో కొత్త రికార్డును చేర్చుకున్నాడు. ఆదివారం వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్ ద్వారా కోహ్లీ ఆసీస్‌పై మొత్తం 500 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్‌‌గా రికార్డు సృష్టించాడు. వైజాగ్ మ్యాచ్‌లో కోహ్లీ 17 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు చేరుకోగానే ఆసీస్‌పై మొత్తం 500 పరుగులు సాధించినట్టయింది. అంతర్జాతీయ టి20 పోటీల్లో ఆసీస్‌పై ఇప్పటివరకు ఎవరూ 500 పరుగులు చేయలేదు. ఇప్పటివరకు ఆసీస్‌పై టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జేపీ డుమినీ పేరిట ఉంది. డుమినీ ఆస్ట్రేలియా జట్టుపై 15 మ్యాచ్ లాడి 378 పరుగులు చేశాడు. కోహ్లీ 14 మ్యాచ్ లలోనే 500 పరుగులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.