ఏపీ సీఎం చంద్రబాబులా తన తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను సీఎం చేయాలనుకోవట్లేదని, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిలా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలనుకోవట్లేదని.. జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యంగా వారిద్దరిలా దిగజారి అబద్ధాలు చెప్పననని పవన్ వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకేనని ఆదివారం కర్నూలులోని సి. క్యాంపు సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే తన పోరాటమని, గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారో, ప్రతిపక్షంలో కూర్చోబెడతారో మీ ఇష్టమని అన్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మేనిఫెస్టోలు చూస్తుంటే సిగ్గేస్తోందని పవన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు రెండింతల వరకు హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్‌లా తాను దిగజారుడు రాజకీయాలు చేయనని, అబద్ధాలు చెప్పబోనని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, జగన్‌లపై తీవ్రస్థాయిలో పవన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్మేమీ ఆయన జేబులోనిదో, టీడీపీ పార్టీ నేతలదో కాదని పవన్ అన్నారు. ప్రభుత్వ సొమ్మునే ఇస్తూ ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తానైతే అమలు చేయగలనని పూర్తిగా నిర్ధారించుకున్నాకే ఏదైనా హామీ ఇస్తానని స్పష్టం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొండారెడ్డి స్ఫూర్తితో రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని పవన్ పేర్కొన్నారు. జనసేనలోకి ఆ ఎంపీ రావాలని, ఈ ఎంపీ రావాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలన్నదే తన తాపత్రయమని పేర్కొన్నారు.