చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసు.. తెరపైకి మరో వ్యక్తి.. శిఖాపై 3 కేసులో

0
39

కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిపై హైదరాబాద్ నగర పోలీసులు 3 కేసులను నమోదు చేశారు. ఇప్పటివరకు దాదాపు 100 మందిని విచారించారు. ఇందులో కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు ఒకరిద్దరు పోలీసులను కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, జయరామ్ హత్య కేసులో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా తెరపైకి వచ్చారు. ఇప్పటికే సుభాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జయరామ్ హత్య అనంతరం సుభాష్ రెడ్డి‌కి రాకేశ్‌రెడ్డి ఫోన్‌ చేసినట్టు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. దీంతో నగేష్, విశాల్, సుభాష్ రెడ్డిలను మంగళవారం మీడియా ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు, జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జయరాం హత్య తర్వాత ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి విలువైన పత్రాలు, ఆభరణాలు తీసుకెళ్లిందని జయరామ్ భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ట్రెస్‌పాసింగ్‌ సెక్షన్‌ కింద శిఖా చౌదరి, ఆమె స్నేహితుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయ సలహాలు తీసుకుని శిఖాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.