పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలకు సమాధానంగా 350 మందికిపైగా జైషే మొహ్మద్ తీవ్రవాదులను భారత వాయుసేన హతమార్చింది. ఇందుకోసం భారత్ తన అమ్ములపొదిలోని మిరాజ్ 2000 రకం జెట్ ఫైటర్లను ఉపయోగించి పాక్ ఆక్రమిత కాశ్మీర్‍లోని జైషే ఉగ్రతండాలను ధ్వంసం చేసింది. ఈ దాడులను పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. ఫలితంగా సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది.
దీంతో అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనాలతో పాటు.. ఆస్ట్రేలియా వంటి దేశాలు స్పందించాయి. పాకిస్థాన్ ప్రతీకార దాడులకు పాల్పడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చాయి. ముఖ్యంగా, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆయా దేశాలు పునరుద్ఘటించాయి. అదేసమయంలో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చాయి.
ఇదిలావుంటే, పాకిస్థాన్‌ను అంతర్జాయ దౌత్య నీతితో భారత్ ఏకాకిని చేసింది. ఇందుకోసం చైనా – భారత్ – రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్‌లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడులను ఈ సందర్భంగా ఆమె వివరించారు.
పాక్‌లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులను సుష్మా సమర్థించారు.భారత్ ఎప్పుడూ సంయమనం పాటిస్తూ భాధ్యతతో నడుచుకుంటుందని హామీ ఇచ్చారు. పాక్ స్థావరంగా పని చేస్తున్న ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే వైమానిక దాడులు చేయాల్సి వచ్చిందన్నారు. పైగా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ భారత్‌లో మరిన్ని దాడులకు కుట్రపన్నుతోందన్న సమాచారం ఉందని, ఆత్మరక్షణలో భాగంగానే బాలాకోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై దాడులు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశం అనంతరం భారత్ – రష్యా – చైనాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పాక్ ఉగ్రవాదాన్ని విడనాడాల్సిందేనంటూ పిలుపునిచ్చాయి. పాక్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రష్యా,చైనా దేశాలు కూడా తోడవడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఒంటరి చేయడంలో భారత్‌పై చేయి సాధించినట్టుగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.