సీనియర్ నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తెలుగు చిత్రసీమ అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి.. అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆపై రాజకీయాల్లోనూ రాణించింది. ప్రస్తుతం సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
తాజాగా ఉత్తరాదిన ప్రజలు ఎక్కువగా వీక్షించే పర్ఫెక్ట్ పతి అనే సీరియల్‌లో నటిస్తోంది. ఆమె పాత్ర పేరు రాజ్యశ్రీ రాథోడ్. ఈ సీరియల్‌లో కోడలి కోసం కన్నకొడుకునే చంపేస్తుంది రాజ్యశ్రీ రాథోడ్. మహిళల హక్కుల కోసం పోరాడే ఆ పాత్రను జయప్రద అద్భుతంగా పోషిస్తోంది.
ఈ నేపథ్యంలో.. తన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తుత పురుషులపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలను మంచి భార్యలుగా తయారుచేసి పురుషులకు అందించడానికి సమాజం ఎంతో ప్రయాస పడుతోందని జయప్రద చెప్పింది. అదే సమయంలో మంచి భర్తలను మన అమ్మాయిలకు ఈ సమాజం తయారుచేయలేకపోతుందని జయప్రద విమర్శలు గుప్పించింది.
భర్తలు ఎలాంటి వాళ్లయినా భరించాల్సిందే అన్నట్టుగా అమ్మాయిలను తయారుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా.. నేటి సమాజంలో మంచి భర్తలు ఎవరూ లేరని జయప్రద అభిప్రాయపడింది. అందుకే పురుషులు మహిళలపై పలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి పరిస్థితి మారాలని జయప్రద అభిప్రాయపడ్డారు.