మళ్లీ పార్టీ మారనున్న దగ్గుబాటి… నేడు జగన్ చెంతకు

0
40

స్వర్గీయ ఎన్.టి.ఆర్ అల్లుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు. ఈయన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త. ఈమె భారతీయ జనతా పార్టీలో ఉంటున్నారు. కానీ, దగ్గుబాటి మాత్రం బీజేపీలో చేరేందుకు సుతరామా ఇష్టపడటం లేదు. దీంతో ఆయన వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 27వ తేదీన తాడేపల్లిలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో తన కుమారుడు దగ్గుబాటి హితేష్‌, ఆమంచి కృష్ణమోహన్‌‌లతో కలిసి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ, మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్ అని, ప్రజలపై ఆయనకు ఉన్న నిబద్ధత వల్లే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కాగా, పార్టీలు మారే విషయంలో దగ్గుబాటికి మించిన రాజకీయ నేత మరొకరు లేరనే టాక్ లేకపోలేదు. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, ఆ పిమ్మట బీజేపీ, ఇపుడు వైకాపా ఇలా యేడాదికో పార్టీ చొప్పున మారే నైజం దగ్గుబాటిది అంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు ఏ ఒక్కపార్టీలోనూ స్థిరంగా ఉండే అలవాటు లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.