అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఏకాకి అయింది. మా భూభాగంలోకి భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు అక్రమంగా ప్రవేశించి… దాడి చేశాయంటూ గగ్గోలు పెట్టినా ఏ ఒక్క దేశం స్పందించలేదు. పైగా, పుల్వామా ఉగ్రదాడిని ప్రతి ఒక్క దేశం ఖండించింది. కానీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహమ్మద్ తీవ్రవాద తండాలపై భారత్ వైమానికదళం చేసిన దాడులను మాత్రం ఏ ఒక్క దేశం ఖండించలేదు. పైగా, సరిహద్దులు దాటిమరీ ఉగవ్రాద శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడులను పలు దేశాలు సమర్థించాయి. భారత్‌కు ఆ హక్కు ఉందంటూ పునరుద్ఘటించాయి. ఫలితంగా దీంతో దౌత్యపరంగా పాక్ దాదాపు ఒంటరిగా మిగిలిపోయింది. ‘మా గడ్డపై దాడి చేశారు’ అని గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి చైనా కూడా పాక్‌కు స్పష్టంగా మద్దతు ప్రకటించలేదు. మెరుపు దాడులకు దారి తీసిన పరిస్థితులు, ఆ అవపసరాన్ని భారత్ పలు దేశాలకు వివరించింది. భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇండొనేసియా, టర్కీ, డొమినికన్ రిపబ్లిక్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్, ఆరు ఆసియాన్ దేశాల దౌత్యవేత్తలతో విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమయ్యారు. కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, పౌర ఆవాసాలు, పాక్ మిలిటరీ స్థావరాల జోలికి వెళ్లలేదని తెలియజేశారు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్‌కు ఉన్న ఆత్మరక్షణ హక్కును గౌరవిస్తామని, దాడులకు మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది. జైషే మహ్మద్ సహా తన భూభాగం నుంచి కార్యకలాపాలు నడుపుతున్న ఉగ్ర మూకలపై పాక్ అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మరైస్ ప్రకటన విడుదల చేశారు. అలాగే, చైనా కూడా పాకిస్థాన్‌కు అండగా నిలబడలేదు. భారత్ వైమానిక దాడులు చేసిన కొద్ది గంటల్లోనే చైనా స్పందించింది. భారత్, పాక్ సంయమనం పాటించి, అంతర్జాతీయ సహకారంతో ఉగ్రవాదంపై పోరాడాలని ఇరు దేశాలకూ పిలుపునిచ్చింది. భారత్, పాక్‌లు దక్షిణాసియాలో ముఖ్యమైన దేశాలని అవి రెండూ పరస్పరం సహకరించుకుంటే ఇరువురికి ప్రయోజనమేకాక ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని చైనా విదేశాంగ ప్రతినిధి లూ కాంగ్ అన్నారు.