ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ బుధవారం ప్రకటన చేశారు. ఈ కొత్త రైల్వే జోన్‌కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌గా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జోన్ పరిధిలోకి గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఉంటాయని వెల్లడించారు.
ప్రస్తుత వాల్తేర్ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజిస్తామన్న గోయల్.. ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపి జోన్‌లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగఢ డివిజన్‌గా మారుస్తున్నామని తెలిపారు. రాయగఢ డివిజన్ ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో భాగంగా ఉంటుందని గోయల్ వివరించారు. రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందిస్తామన్నారు.
కాగా, మరో రెండు రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేయడం గమనార్హం. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుపతి పర్యనలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మూడు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇపుడు ఉన్నట్టుండి ప్రకటన చేయడం గమనార్హం.