పుల్వామా జైషే పనే.. ఆధారాలు సమర్పించిన భారత్..

0
53

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుల్వామా దాడి ఘటనను ఖండిస్తూ.. ఇప్పటికే ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో భారత్ ఆ దాడికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలు చూపించింది. పుల్వామా దాడికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థే కారణమని తెలిసినా పాకిస్థాన్ కవ్వింపు చర్యలు చేపడుతోంది.

ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడింది జైషే మహ్మద్ ఉగ్రవాది అని, అతడికి సాయం అందింది పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాల నుంచే అని స్పష్టంగా ఆధారాలతో సహా పాకిస్థాన్‌కు భారత్ అందించింది.

ఈ మేరకు భారత్‌లో పాక్ తాత్కాలిక హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు ఈ ఆధారాలను భారత్ అందజేసింది. పాకిస్థాన్ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు పంపింది. భారత్ గగనతలంలోకి పాక్ యుద్ధవిమానాలు ప్రవేశించాయని, భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయంటూ విదేశాంగ శాఖ తన నిరసన వ్యక్తం చేసింది.

పుల్వామా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడికి దీటుగా భారత్ సర్జికల్ స్ట్రయిక్స్-2తో బదులిచ్చిన సంగతి తెలిసిందే. 40 మంది జవాన్ల మృతికి 350 మంది ఉగ్రవాదుల ప్రాణాలతో ప్రతీకారం తీర్చుకుంది భారత్.

దీని గురించి తెలిసినవాళ్లు కేవలం ఏడుగురు వ్యక్తులే. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, నిఘా సంస్థ రా అధిపతి ధస్మానాకు మాత్రమే ఈ దాడుల గురించి తెలుసునని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.