నా సినీ కెరీర్ ముగిసిందని అనుకున్న సమయంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన బాహుబలి చిత్రం తనను రక్షించిందని మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత తన సినీ గ్రాఫ్ మళ్లీ పుంజుకుందని చెప్పారు.
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటివరకు తన కెరీర్‌లో చేసిన సినిమాల గురించి, బాలీవుడ్ ప్రయాణం గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘నిజాయతీగా చెప్పాలంటే నేను కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడే నాకు బాహుబలిలో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందు నేను చేసిన హిందీ చిత్రాలన్నీ భారీవే. కానీ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దాదాపు ఏడాదిన్నరగా బాహుబలి సినిమాను రాజమౌళి సర్ తెరకెక్కిస్తున్నప్పుడు ఆయన నన్ను సంప్రదించారు.
బహుశా కేమియో (అతిథి) పాత్ర కోసం అడుగుతున్నారని అనుకున్నా. కానీ ఆయన అవంతిక గురించి చెప్పగానే చాలా ఆనందించా. ఎందుకంటే అది అంత అందమైన పాత్ర. అలాంటి పాత్రలను భారత సినీ చరిత్రలో తెరకెక్కించి ఉంటారని నేననుకోను. రాజమౌళిగారు… నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను అని తమన్నా వెల్లడించారు.
కాగా, దటీజ్ మహాలక్ష్మి చిత్రం బాలీవుడ్‌లో కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రానికి రీమేక్. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలోనూ, ‘అభినేత్రి-2’తో పాటు.. ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తమన్నీ బిజీగా గడుపుతోంది.