మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, డోన్ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ కూడా పార్టీని వీడారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. ఆయనతో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ, 65 ఏళ్లకు పైగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధగా ఉన్నా.. రాజకీయ పరిస్థితుల వల్ల పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. 2న కోడుమూరులో జరిగే సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో తనతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కీలక నేతలందరూ టీడీపీలో చేరతారన్నారు.
మరోవైపు, పాణ్యం వైకాపా ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని భావించిన గౌరు దంపతులు సొంతపార్టీ వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. వచ్చే నెల 3వ తేదీన అమరావతిలో సీఎం సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు వారికి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం.
