పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు భారత్‌పై విషం చిమ్మారు. పుల్వామా ఉగ్రదాడిని పక్కనబెట్టి భారత్ ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. పైగా, పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనంటూ జైషే మొహ్మద్ సంస్థ పదేపదే వీడియో ఆధారాలు బహిరంగ పరుస్తున్నప్పటికీ.. అవి ఇమ్రాన్ కంటికి కనిపించడం లేదు. పైగా, పుల్వామా ఉగ్రదాడికి సరైన ఆధారాలు ఇవ్వాలని పదేపదే కోరడం ఆయనకే చెల్లింది.
ఆయన గురువారం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ, పుల్వామా దాడులు, తదనంతరం భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కాశ్మీర్ సంక్షోభమే కారణమన్నారు. “మొత్తం సమస్యకు కాశ్మీరే కారణం. భారతీయ నేతలు, వారి విధానానికి కాశ్మీర్‌లో ఒక్క నాయకుడు కూడా మద్దతు ఇవ్వడం లేదు. కాశ్మీరీలు ఎపుడూ స్వేచ్ఛనే కోరుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు.
పుల్వామా ఉగ్రదాడి వెనుక పాక్ కుట్రను పక్కనబెట్టి… భారత్ ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ పాక్ ప్రధాని బుకాయించారు. ’19 ఏళ్ల కాశ్మీరీ యువకుడు (ఆదిల్ అహ్మద్ దార్) ఆయుధాలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో, ఇదంతా (పుల్వామా ఉగ్రదాడి) ఎందుకు చేయాల్సి వచ్చిందో భారత్ ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.