పాకిస్థాన్ ఆర్మీ చెరలో బందీగా ఉన్న భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం సురక్షితంగా స్వదేశానికి చేరుకునున్నారు. ఆయన్ను విడుదల చేసేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
తన బిడ్డ విడుదలపై అభినందన్ తండ్రి, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహుకుట్టి అభినందన్ వర్ధమాన్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌లో బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ సురక్షితంగా స్వదేశానికి తిరిగొస్తున్నందుకు ఆనందం గా ఉందని చెప్పారు. కుమారుడి ధీరత్వం పట్ల తనకు గర్వంగా ఉందన్నారు. అదేసమయంలో కష్టకాలంలో తమ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న దేశ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు.
‘మీ అందరి ఆందోళన, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మాపై కరుణ చూపిన దేవుడికి కృతజ్ఞతలు. అభి సజీవంగా ఉన్నాడు. గాయపడలేదు. మానసికంగా దృఢంగా ఉన్నాడు. శత్రువుల చేతిలో బందీగా ఉన్నప్పటికీ నిజమైన సైనికుడిలా ధీరత్వంతో మాట్లాడాడు. అతడి పట్ల చాలా గర్వంగా ఉంది’ అని సింహకుట్టి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.