శత్రుసైన్యం చేతిలో బందీగా ఉన్న భారత వైమానికదళ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్ధమాన్ సొంతగడ్డపై అడుగుపెట్టారు. స్థానిక కాలమానం ప్రకారం ఆయన 6.30 గంటల సమయంలో భారత భూభాగంలోకి తిరిగి వచ్చారు. భారత చేసిన దౌత్య యుద్ధానికి పాకిస్థాన్ తలవంచింది. దీంతో అభినందన్ పట్టుబడిన కేవలం 48 గంటల్లోనే తిరిగి భరతగడ్డపై అడుగుపెట్టాడు. ఆయన రాకను చూసిన భారతావని పులకించిపోయింది.
అభినందన్‌ని వాఘా – అట్టారి సరిహద్దుల మీదుగా అభినందన్‌ను తీసుకువచ్చిన పాకిస్థాన్ సైన్యం అట్టారి వద్ద బీఎస్ఎఫ్‌కు అప్పగించింది. ఐఏఎఫ్ టీమ్‌కు చెందిన ఇద్దరు వైస్ మార్షల్స్, ఇండియన్ హైకమిషన్ ప్రతినిధి బృందం, విదేశాంగ శాఖ అధికారులు అభినందన్‌కు సాదర స్వాగతం పలికారు. అభినందన్ రాక కోసం నిన్నటి నుంచి వాఘా సరిహద్దుల వద్ద వేచిఉన్న వందలాది మంది ప్రజలు ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. డ్రమ్ములు వాయిస్తూ సంబరాలు చేసుకున్నారు. దేశభక్తి నినాదాలు హోరెత్తించారు.
బుధవారం జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్థాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే చర్యలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధవిమానాన్ని శత్రుసైన్య కూల్చివేసింది. దీంతో అది పాకిస్థాన్ భూభాగంలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకున్న అభినందన్… పారాచ్యూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాడు. దీంతో స్థానికులు ఆయన్ను పట్టుకుని శత్రుసైన్యానికి అప్పగించింది. ఫలితంగా అభినందన్ పాకిస్థాన్ సైన్యం చేతిలో బందీగా ఉన్నాడు.
జెనీవా ఒప్పందం ప్రకారం ఆయనను వెంటనే బేషరతుగా స్వదేశానికి తిప్పి పంపాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం అభినందన్‌ను పాక్ అధికారులు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు అప్పగించారు. ఆయనను భారత్‌కు తీసుకువచ్చేందుకు అవసరమైన విధివిధానాలను పాక్‌లోని భారత హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా పూర్తి చేశారు.
అనంతరం అభినందన్‌ను తీసుకుని ఆయన లాహోర్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. అభినందన్‌ను వాఘా సరిహద్దుల వద్ద భారత సైన్యానికి పాక్ అధికారులు అప్పగించారు. దీంతో అభినందన్‌ను తొలుత అమృత్‌సర్‌కు, అక్కడి నుండి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో వైద్య పరీక్షల కోసం ఢిల్లీ తరలించనున్నారు. ఆయనను కలుసుకునేందుకు అభినందన్ తల్లిదండ్రులు ఇప్పటికే అమృతసర్‌కు చేరుకున్న విషయం తెల్సిందే.