ఉగ్రవాది మసూద్ చచ్చాడా.. బతికేవున్నాడా? భారత్ ఆరా!

Masood Azhar, Jaish-E-Mohammed Chief, Is Alive, Says Pakistani Media

0
44
Masood Azhar
Masood Azhar

కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ మృతి చెందినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జైషే మహ్మద్ స్పందించింది. మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఆయన చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని ప్రకటించింది. తమ నేత ఆరోగ్యంగా ఉన్నాడని ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, మసూద్ అజహర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కొన్నిరోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రకటించిన విషయం తెల్సిందే. తద్వారా జైషే అధినేత తమ దేశంలోనే ఉన్నాడని పరోక్షంగా అంగీకరించారు.

అయితే, మసూద్ అజహర్ లివర్ క్యాన్సర్ కారణంగా మృతిచెందాడని కొన్ని కథనాలు తెరపైకి రాగా, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్-2లో ప్రాణాలు కోల్పోయాడని మరికొన్ని కథనాలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో… అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు పాకిస్థానే మసూద్ అజహర్ చనిపోయాడంటూ ప్రచారం చేస్తోందన్న వాదనలు బయల్దేరాయి.

ఈ పరిస్థితుల్లో అజహర్ అసలు చనిపోయాడా.. ఇంకా జీవించే ఉన్నాడా అనే అంశంపై భారత్ ఆరా తీస్తోంది. పైగా, అసలు, సర్జికల్ దాడులు జరిగినప్పటి నుంచి ఈ ఉగ్రనేత నుంచి ఒక్క ప్రకటన కూడా రాకపోవడంతో బతికున్నాడా? లేదా? అనే విషయమై భారత వర్గాలు సైతం సందిగ్ధతలో ఉన్నాయి. ప్రస్తుత వదంతులపై పాక్ నుంచి కనీస స్పందన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.