త్వరలో జరుగనున్న ప్రపంచ క్రికెట్ కప్ పోటీల నుంచి పాకిస్థాన్ జట్టును బహిష్కరించాలన్న డిమాండ్ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ చేసిన విన్నపాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్‌ను పక్కనబెట్టాలని, ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌తో తెగదెంపులు చేసుకోవాలని కోరింది. అయితే బీసీసీఐ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది.
ఆదివారం జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశం ముగింపు సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఈ అంశంపై చర్చించారు. బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయడం సాధ్యం కాదని నిర్ణయించారు.
ఐసీసీ బోర్డులో బీసీసీఐ యాక్టింగ్ సెక్రటరీ అయిన అమితాబ్ చౌధురి ఈ సమావేశానికి బీసీసీఐ లేఖను తీసుకురాలేదు. అయినా, శశాంక్ మనోహర్ ఈ అంశాన్ని స్వయంగా లేవనెత్తి చర్చించారు. అన్ని దేశాలు క్రికెట్ ఆడటమే ఐసీసీ ప్రథమ లక్ష్యమని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు.
దీంతో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్థాన్ హాజరుకానుంది. అయితే, ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుందా లేదా అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.