తెలంగాణ సర్కారు తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఐటీ కంపెనీలపై దాడులు ఎందుకు జరిగాయంటే.. టీడీపీ డేటాను వైసీపీకి ఇచ్చేందుకేనని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికే తెలంగాణ పోలీసులు దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు.
ఏపీ డేటా హైదరాబాదులో వుంటే వెంటనే తమకు పంపించాలన్నారు. ఈ విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ”జలసిరికి హారతి” కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తమ్ముళ్లందరికీ ఐటీ కంపెనీలు హైదరాబాదులో ఎలా వచ్చాయని తెలుసునన్నారు. తన వల్లే హైదరాబాదులో ఐటీ కంపెనీలు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందని తాను చెప్పాకనే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందని తెలిపారు.