అజారుద్ధీన్ ఇంటి కోడలు కానున్న సానియా మీర్జా చెల్లెలు?

0
76

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా మీర్జా సోదరి కూడా త్వరలో పెళ్లికూతురు కానుంది. ఆమె కూడా ఓ క్రికెటర్ వారసుడిని వివాహం చేసుకోనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భారత క్రీడారంగంలో మహ్మద్ అజారుద్దీన్, సానియా మీర్జాకు ప్రత్యేక స్థానమున్న సంగతి తెలిసిందే. తాజాగా, అజార్ తనయుడు అసద్ (28), సానియా చెల్లెలు ఆనమ్ మీర్జా (25) త్వరలోనే ఒకింటి వారు కానున్నారని టాక్ వస్తోంది. అసద్, ఆనమ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు వారి సోషల్ మీడియా అకౌంట్లే చెప్పేస్తున్నాయి.

ఫిబ్రవరిలో ఆనమ్ పుట్టినరోజు సందర్భంగా అసద్ పెట్టిన పోస్టును బట్టి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియా ఖరారు చేసేసింది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు అజార్ తనయుడు.

అంతేకాదు, మీర్జా సోదరీమణులు సానియా, ఆనమ్‌ల తోనూ ఓ ఫొటోలో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం అజార్ కుటుంబం దుబాయ్‌లో షాపింగ్ చేస్తుండడం కూడా పెళ్లి కోసమే అన్న వార్తలకు ఊతమిస్తోంది. మరి వీరి వివాహం ఎప్పుడు జరుగనుంది. వీరిద్దరి ప్రేమాయణంలో నిజమెంత అనే విషయాలు తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.