అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత క్రికెట్ మాస్టర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈయన తన వన్డే కెరీర్లో మొత్తం 49 సెంచరీలు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ పేరిట ఉంది. ఇపుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రికార్డును బద్ధలు కొట్టేందుకు పరుగు తీస్తున్నాడు.
నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో కోహ్లీ 40వ సెంచరీ చేశాడు. అంటే.. సచిన్ అత్యధిక సెంచరీల (49) రికార్డుకు ఇంకో తొమ్మిది శతకాల దూరంలో ఉన్నాడు.
అలాగే, టీమ్ఇండియా వన్డే విజయాల సంఖ్య 500కు చేరింది. ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ ఆవిష్కరించింది. 558 విజయాలతో ముందున్న ఆస్ట్రేలియాపైనే భారత్ 500వ విజయం సాధించడం విశేషం.
ముఖ్యంగా, భారత్ సాధించిన 300వ, 400వ, 500వ వన్డే విజయాల్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భాగస్వామి కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.