భారత్‌కు అమెరికా హెచ్చరిక జారీచేసింది. అయినప్పటికీ భారత్ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. అసలు ఎంతో స్నేహభావంతో మెలుగుతున్న ఈ రెండు దేశాల మధ్య హెచ్చరికులు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఓసారి తెలుసుకుందాం.
భారత్ తమకు సమానతా ప్రాతిపదికన హేతుబద్ధంగా మార్కెట్‌ను అందుబాటులో ఉంచడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తూ దేశానికి ప్రాధాన్యతా వాణిజ్య హోదా తొలగించే యోచన ఉన్నట్టు ప్రకటించారు. ఈ చర్య వల్ల అమెరికాకు మన ఎగుమతులపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండబోదని భారత్ స్పష్టం చేసింది.
చైనా వంటి దేశాలతో అనుచిత వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయన్న కారణంగా భారత్, టర్కీలకు సార్వత్రిక ప్రాధాన్యతా విధానం (జీఎస్‌పీ) తొలగింపు నిర్ణయం అమెరికా తీసుకుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న ట్రంప్ భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తోందని పదే పదే హెచ్చరించారు.
అయినా ఫలితం లేకపోవడంతో భారత్, టర్కీలకు జీఎస్‌పీ తొలగించే యోచన ఉన్నదంటూ కాంగ్రెస్‌కు లేఖలు రాశారు. జీఎస్‌పీ కార్యక్రమం పరిధిలోకి వచ్చిన వర్థమాన దేశాలు కాంగ్రెస్ నిర్దేశించిన అర్హతా ప్రమాణాలకు కట్టుబడిన పక్షంలో ఆటో విడిభాగాలు, టెక్స్‌టైల్ మెటీరియల్స్ సహా 2 వేల ఉత్పత్తులు అమెరికాలోకి ఎలాంటి సుంకాలు లేకుండా ప్రవేశించవచ్చు. 2017 సంవత్సరంలో ఈ కార్యక్రమం కింద 570 కోట్ల డాలర్ల విలువ గల దిగుమతులకు అమెరికాలో ఎలాంటి సుంకాలు లేకుండా భారత్ గరిష్టంగా లాభపడగా టర్కీ ఐదో స్థానంలో నిలిచింది.