ఆస్ట్రేలియాలో ఎన్నారై డెంటిస్ట్ ప్రీతిరెడ్డి (32) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన ప్రీతి.. మంగళవారం ఆమె కారు డిక్కీలోనే సూట్‌కేసులో మృతదేహంగా కనిపించింది. ఈ హత్యకు పాల్పడింది ప్రీతి మాజీప్రియుడు, డాక్టర్ హర్షవర్దన్‌నర్దే అని ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే హర్షవర్దన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి 1983లో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్‌వెస్టర్న్ సిడ్నీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పెద్దకూతురు ప్రీతిరెడ్డి అస్ట్రేలియాలోనే వైద్యవిద్య పూర్తిచేసి గ్లెన్‌బ్రూక్ ఆస్పత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తోంది. అదేసమయంలో అదే ఆస్పత్రిలో పని చేసే సహ వైద్యుడు హర్షవర్దన్ నర్దేతో కొంతకాలం ప్రేమలో ఉన్నది. ఆ తర్వాత వారిమధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు.
ఈ నేపథ్యంలో శనివారం సెయింట్ లియోనార్డ్స్‌లో ఓ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రీతిరెడ్డి ఆదివారం ఉదయం 11గంటలకు ఫోన్‌చేసి టిఫన్ చేసి ఇంటికి వస్తానని చెప్పింది. కానీ, ఆమె ఎంతకీ రాకపోవడంతో ఆమె సోదరి నిత్యారెడ్డి పోలీసులను ఆశ్రయించారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మాజీప్రియుడు హర్షవర్దన్ నర్దేతో కలిసి సిడ్నీ జార్జ్‌స్ట్రీట్‌లోని మెక్‌డొనాల్డ్స్ షోరూంలో ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. మంగళవారం కింగ్స్‌ఫోర్డ్‌లోని స్ట్రాస్‌చస్‌లేస్‌లో ప్రీతిరెడ్డి కారు ఉండడాన్ని గమనించిన పోలీసులు అక్కడకు పరిశీలించగా.. డిక్కీలో ఉన్న సూట్‌కేసులో మృతదేహాన్ని కన్పించింది. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి.
ఆదివారం హర్షవర్దన్ నర్దేతో కలిసి ప్రీతి రెడ్డి మార్కెట్‌స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో రూం తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడికి ఫోన్‌లో హత్య విషయంపై ఆరాతీశారు. కాగా, బుధవారం హర్షవర్దన్ నర్దే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన కారును కావాలనే ట్రక్కును ఢీకొట్టి బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.